రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, అడాగ్ చీఫ్ అనిల్ అంబానీ, ఎయిర్‌బస్ సీఈవో బెర్న్‌హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా డిజిటల్ రంగంపై సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు.
వచ్చే ఐదేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిర్లా, రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మిట్టల్ తెలిపారు. డిజిటల్, క్లౌడ్, టెలికం తదితర రంగాల్లో రాబోయే కొన్నేళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అనిల్ అంబానీ వివరించారు. వచ్చే ఐదేళ్లలో నెట్‌వర్క్ విస్తరణ, బ్రాడ్‌బ్యాండ్ తదితర విభాగాలపై 7 బిలియన్ డాలర్లు, డిజిటల్ ఇండియా ప్రాజెక్టుల కింద మరో 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కుమార మంగళం బిర్లా వెల్లడించారు. డిజిటల్ ఇండియా వీక్‌కు సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తామని వీడియో సందేశంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తైవాన్ కంపెనీ డెల్టా ఎలక్ట్రానిక్స్ వర్గాలు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించాయి.
రూ. 2.5 లక్షల కోట్లు వెచ్చిస్తాం...
‘‘డిజిటల్ ఇండియా సాకారంలో భాగంగా మా సంస్థలు రూ.2.5 లక్షల కోట్లు పెట్టుబడి పెడతాయి. మౌలిక సదుపాయాల విషయానికొస్తే మేం ప్రపంచంలోనే అత్యుత్తమమైన తదుపరి తరం ఇంటర్నెట్ ప్రొటోకాల్‌ను దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఆరంభిస్తున్నాం. లక్షన్నర మంది ఎలక్ట్రానిక్ రిటైలర్లు స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ పరికరాలు సర్వీసు చేసేలా రిలయన్స్ జియో ద్వారా దేశవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చే స్తాం. వీటిని ఇండియాలోనే తయారుచేసి అందుబాటు ధరలకు అందించేందుకు ప్రధాన తయారీదారులతో మాట్లాడుతున్నాం. ఇక ఈ-గవర్నెన్స్, ఈ-విద్య, ఈ-ఆరోగ్యం, స్మార్ట్ సిటీలు, గ్రామీణ డిజిటల్ సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పెట్టుబడి పెట్టడానికి సిద్ధం. కీలక నగరాలు, పట్టణాల్లో జియో డిజిటల్ ఇండియా స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తాం. వీటన్నిటిద్వారా మేం 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామనేది నా అంచనా’’
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి