ఫార్చ్యూన్ లిస్ట్ లో ఐఆర్ సీటీసీ, జస్ట్ డయల్
న్యూఢిల్లీ : జస్ట్ డయిల్, ఐఆర్ సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), యూటీఐ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు ఫార్చ్యూన్ నెస్ట్ 500 భారత కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. డైనమ్యాటిక్ టెక్నాలజీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మధ్యస్త కంపెనీలే ఈ జాబితాలో ఎక్కువగా చోటుదక్కించుకోగా, వార్షిక ఆదాయం రూ.1,693 కోట్లతో డైనమ్యాటిక్ టెక్నాలజీ టాప్ లో ఉంది. డైనమ్యాటిక్ తర్వాత రూ.1,692 కోట్లతో నెక్ట్రా లైఫ్ సైన్స్, రూ,1,689 కోట్లతో ఓస్వాల్ వుల్లెన్ మీల్స్, రూ.1,682.5 కోట్లతో వీఆర్ఎల్ లాజిస్టిక్స్, రూ.1,682.18 కోట్లతో హిటాచీ హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్ లు ఉన్నాయి.
అయితే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న యూటీఐ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ(442), జస్ట్ డయిల్(449)లు కొత్త కంపెనీలుగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచాయి. అయితే గతేడాది 328 ర్యాంకు తో ఉన్న ఇండియన్ రైల్వేస్ టూరిజం అండ్ కేటరింగ్ సంస్థ ఐఆర్ సీటీసీ తన ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుని, 199 ర్యాంక్ ను దక్కించుకుంది. మరో ఇతర నాలుగు కంపెనీలు సైతం గతేడాది కంటే తమ ర్యాంకింగ్ లను మెరుగుపరుచుకున్నాయి. నెస్ట్ 500 కంపెనీలు మొత్తం రెవెన్యూలు రూ.5,14,788 కోట్లగా నమోదైనట్టు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. వివిధ రంగాల నుంచి ఈ సంస్థలు ఫార్చ్యూన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఫైనాన్సియల్ సర్వీసులు, ఫుడ్ అండ్ అగ్రి ప్రొడక్ట్స్, ఫార్మా అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి