ఆ 18 లక్షల్లో సగం మందిపై అనుమానమే!
• నోట్ల రద్దు అనంతర డిపాజిటర్లపై ఐటీ శాఖ
• మార్చి 31 తరువాత చర్యలు ఉంటాయని సూచన
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ శాఖ తెలిపింది. ఆయా అకౌంట్ హోల్డర్లు అందరిపై కొత్త పన్ను క్షమాభిక్ష పథకం–పీఎంజీకేవై ముగిసిన తర్వాత (మార్చి 31) చర్యలు ఉంటాయని కూడా పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం అకౌంట్లలో రూ.5 లక్షల దాటి రద్దయిన నోట్లు డిపాజిట్ అయిన మొత్తాలకు సంబంధించి ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 18 లక్షల మందికి ఐటీ శాఖ ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్ సందేశాలను పంపుతూ సమాధానాలను కోరిన సంగతి తెలిసిందే.
దీనికి తుది గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. వీరిలో దాదాపు 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12వ తేదీ నాటికే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్స్‌కు ఎటువంటి చట్టబద్దతా ఉండదు. దీంతో అనుమానాస్పద డిపాజిట్‌దారులకు మళ్లీ తగిన చట్టబద్దమైన నోటీసులు జారీ చేసి ఐటీ శాఖ వివరణ కోరనుంది. నల్లకుబేరులకు ఆఖరి క్షమాభిక్ష పథకం పీఎంజీకేవై మార్చి 31న ముగిసిన తర్వాత, అనుమానాస్పద డిపాజిట్ దారులపై సైతం ఐటీ చర్యలకు సిద్ధమవుతోంది.