హైదరాబాద్లో జేడ్ గ్లోబల్ సొంత కేంద్రం
♦ నియామకాల్లో భారత్‌కే ప్రాధాన్యత
♦ అయిదేళ్లలో 2,000 మంది ఉద్యోగులు
♦ ‘సాక్షి’తో కంపెనీ వ్యవస్థాపకుడు వై.కరణ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ ‘జేడ్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్’ హైదరాబాద్‌లో సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే గచ్చిబౌలిలో కంపెనీ తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. లీజు ప్రాతిపదికన తీసుకున్న ఈ సెంటర్‌లో 100 మంది ఉద్యోగులు పనిచేసేందుకు ఏర్పాట్లున్నాయి. అమెరికా, యూకేతో పాటు దేశంలోని పుణె, నోయిడాల్లో సంస్థకు కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌లో వచ్చే రెండు మూడేళ్లలో సొంత క్యాంపస్ నెలకొల్పుతామని జేడ్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ ఫౌండర్, సీఈవో వై.కరణ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. ‘ఐటీ రంగానికి అవసరమైన టాప్ టాలెంట్ ఇక్కడ ఉంది. అత్యుతమ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడ అడుగుపెట్టాయి. అందుకే హైదరాబాద్‌లో సొంత కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’’ అని వివరించారాయన.
భారత్ నుంచి 60 శాతం...
నల్గొండ జిల్లాకు చెందిన కరణ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. 2003లో జేడ్ గ్లోబల్‌ను స్థాపించారు. సంస్థలో ప్రస్తుతం 550 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో 50 మంది ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను డిసెంబరుకల్లా 100కు చేరుస్తామని కరణ్ చెప్పారు. కంపెనీ ఈ మధ్యే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలోకి అడుగుపెట్టింది. 2021 నాటికి సిబ్బంది సంఖ్యను 2,000లకు చేర్చాలన్నది లక్ష్యమని కరణ్ తెలియజేశారు. ‘‘వీరిలో 60 శాతం మంది భారత్ నుంచే ఉంటారు. లండన్ కార్యాలయం కోసం కూడా నియామకాలను చేపడుతున్నాం. ఐపీ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడులు పెడతాం. బిగ్ డేటా, ఆటోమేషన్‌పై ఫోకస్ చేస్తాం. జేడ్ టర్నోవర్ ప్రస్తుతం రూ.200 కోట్లుంది. యూఎస్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-5,000 ప్రైవేటు కంపెనీల్లో జేడ్ వరుసగా అయిదేళ్లుగా స్థానం సంపాదిస్తోంది’’ అని వివరించారు.
మరిన్ని కంపెనీలొస్తాయి..
ఇతర దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మరిన్ని ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు రానున్నాయని కరణ్ తెలిపారు. ‘తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గతేడాది యూఎస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌కున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. ఆయన ఆహ్వానం మేరకే ఇక్కడ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. మరింత మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు’ అని తెలియజేశారు. క్లయింట్ల సౌకర్యం కోసం 2006లో పుణేలో ఆఫీసు ప్రారంభించామని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న అనిశ్చితితో హైదరాబాద్ వైపు దృష్టిసారించలేకపోయామని చెప్పారాయన. ఇప్పుడు అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు.