![ఐక్లీన్‌లో జపాన్ కంపెనీ పెట్టుబుడులు](/styles/webp/s3/article_images/2017/09/3/81450294725_625x300.jpg.webp?itok=_fXNpZGg)
ఐక్లీన్‌లో జపాన్ కంపెనీ పెట్టుబుడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్‌రూమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఐక్లీన్)లో 26శాతం వాటాను జపాన్‌కు చెందిన టకసాగో థర్మల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (టీటీఈ) కొనుగోలు చేసింది. కానీ ఈ వాటాను ఎంత మొత్తానికి కొనుగోలు చేసింది తెలియచేయలేదు. 98 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ సేవల్లో ఉండి 2.5 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఇంధన పొదుపులో అనేక పేటెంట్లు ఉన్న టీటీఈ భాగస్వామిగా చేరడం ద్వారా మరిన్ని రంగాలకు, దేశాలకు విస్తరించగలమన్న ధీమాను ఐక్లీన్ వ్యక్తం చేసింది.
ఈ ఒప్పందం వివరాలను తెలియచేయడానికి బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్లీన్ ఫౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.గోపీ మాట్లాడుతూ టీటీఈ జపాన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉండటంతో ఒప్పందం విలువను ఇప్పుడే తెలియచేయలేమన్నారు. ప్రస్తుతం ఐక్లీన్ కంపెనీ టర్నోవర్ రూ. 310 కోట్లని, మూడేళ్లలో ఏటా 40 శాతం వృద్ధితో రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించాలని లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం ఐక్లీన్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం మూడు తయారీ కేంద్రాలు ఉన్నాయి. త్వరలోనే మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీఈ జనరల్ మేనేజర్ మసాటో నకమురా మాట్లాడుతూ ఐక్లీన్‌తో చేతులు కలపడం ద్వారా మరిన్ని దేశాలకు వేగంగా విస్తరించే అవకాశం ఉందన్నారు.