
కృష్ణపట్నం పోర్టు భేష్!
జపాన్ పారిశ్రామిక బృందం
ముత్తుకూరు/తడ: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలంగా ఉందని జపాన్ పారిశ్రామిక బృందం ప్రశంసించింది. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు పర్యటనకు వచ్చిన జపాన్‌లోని ప్రముఖ పరిశ్రమలకు చెందిన 50 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం పోర్టులో పర్యటించింది. ఈ బృందంలో హిటాచి, మిత్సుబిషి, టయోటా తదితర సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
ఈ సందర్భంగా పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి వీరికి ఘనస్వాగతం పలికారు. కండలేరు క్రీక్‌కు ఇరువైపులా పోర్టులో జరుగుతున్న బెర్తుల నిర్మాణం, ఎగుమతులు-దిగుమతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ప్రస్తుతం తీరప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టుల వివరాలను తెలిపారు. అనంతరం జపాన్ పారిశ్రామిక బృంద సభ్యులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు, పరికరాలు, ముడిసరుకులు దిగుమతి చేసుకొనేందుకు కృష్ణపట్నం పోర్టు అనుకూలంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు అనువైన సముద్రతీర ప్రాంతం ఉందని పేర్కొన్నారు.
శ్రీసిటీలో అమెరికా బృందం పర్యటన
అమెరికాకు చెందిన వాణిజ్య దూత కార్యాలయ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం తడ సమీపంలోని శ్రీసిటీని సందర్శించింది. ముఖ్య వాణిజ్య అధికారి జాన్ ఫ్లెమింగ్ నేతృత్వంలో వచ్చిన బృందానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికి శ్రీసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు చేపట్టిన మౌలిక వసతుల గురించి వివరించారు. ఇప్పటికే శ్రీసిటీలో 9 అమెరికా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన అన్ని వసతులనూ ఇక్కడ నెలకొల్పినందుకు జాన్ ఫ్లెమింగ్ శ్రీసిటీ యాజమానాన్ని అభినందించారు. ఈ బృందంలో రాజకీయ, ఆర్థిక వ్యవహారాల అధికారి కల్పనమూర్తి, ఆర్థిక నిపుణులు జార్జి మ్యాథ్యూస్ తదితరులు ఉన్నారు.
జపాన్ బృందం కూడా...
జపాన్ దేశానికి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు కూడా శుక్రవారం తడ సమీపంలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో పర్యటించారు.