
న్యూఢిల్లీ: నిధుల కటకటతో బ్యాంకుల అధీనంలోకి వెళ్లిన జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణకు కొత్త ఇన్వెస్టర్ కనీసం రూ.4,500 కోట్లను తీసుకురావాల్సి ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 26 బ్యాంకుల కమిటీ వచ్చే నెలలో జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ చక్కని సంస్థ అని, ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించి, ఏప్రిల్ 30 నాటికి బిడ్లను ఆహ్వానించాలన్నది బ్యాంకుల ప్రణాళిక. ‘‘ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్‌లైన్ లేదా నరేష్ గోయల్ లేదా ఎతిహాద్ ఎవరైనా కావొచ్చు. ఎయిర్‌లైన్‌ను సొంతం చేసుకునేందుకు ఎవరినీ నిషేధించలేదు’’ అని రజనీష్ కుమార్ అన్నారు.
జీతాలు ఇవ్వండి బాస్..
పెండింగ్‌లో ఉన్న తమ జీతాలను వెంటనే ఇప్పించాలంటూ జెట్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్‌ఏజీ) ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ను కోరింది. జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సేవలను నిలిపివేస్తామని 1,100 మంది ఉద్యోగులతో కూడిన ఈ సంఘం హెచ్చరించడం గమనార్హం. జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.1,500 కోట్ల అత్యవసర లిక్విడిటీని అందించనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి నూతన యాజమాన్యానికి విన్నపాలు పెరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment