సాక్షి, ముంబై : తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్ తన సర్వీసులు నిలిపివేయడానికి సిద్ధమైంది. బుధవారం( ఏప్రిల్ 17) రాత్రి నుంచే తమ సేవలను పూర్తిగా నిలిపివేయనుంది. రాత్రి 10:30కు అమృత్‌సర్ నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్.. జెట్ ఎయిర్‌వేస్‌కు చివరి విమాన సర్వీస్ కానుంది. మంగళవారం నాటి జెట్ ఎయిర్‌వేస్ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. అదనపు నిధులకు సంబంధించి జెట్ ఎయిర్‌వేస్ విన్నపాన్ని బ్యాంకులు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక జెట్‌ఎయిర్‌వేస్ మూసివేత నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ అత్యవసరంగా రూ.400 కోట్లు ఇవ్వాలని ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంను కోరిన విషయం తెలిసిందే.
రూ. 3500 కోట్ల రుణ భారానికి తోడు, టికెట్ల కాన్సిలేషన్ ద్వారా ప్రయాణికులకు చెల్లించాల్సిన చార్జీల విలువ రూ.3500 కోట్లకు చేరింది. దీంతో జెట్ ఎయిర్‌వేస్ అప్పుల భారం మొత్తం రూ. 8500 కోట్లకు ఎగబాకింది. ఈ తీవ్ర సంక్షోభంతో గత మూడు నెలలుగా ఉద్యోగులకు జెట్ ఎయిర్‌వేస్ జీతాలు చెల్లించలేదు. ఇప్పటికే వారు నిరసన వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్‌వేస్ అంశంలో జోక్యం చేసుకుని, సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించాలని పైలెట్ల యూనియన్ ప్రధాని మోదీని కూడా అభ్యర్థించాయి. జెట్‌ఎయిర్‌వేస్ తాజా నిర్ణయంతో 16వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమైంది. ఆల్‌ఇండియా జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది ఏప్రిల్ 18న మేనేజ్‌మెంట్‌తో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment