జేకే లక్ష్మీ సిమెంట్‌ జోరు- చెన్నై పెట్రో పతనం | JK lakshmi cement up -Chennai petroleum plunges | Sakshi
Sakshi News home page

జేకే లక్ష్మీ సిమెంట్‌ జోరు- చెన్నై పెట్రో పతనం

Published Thu, May 21 2020 10:24 AM | Last Updated on Thu, May 21 2020 10:24 AM

JK lakshmi cement up -Chennai petroleum plunges - Sakshi

ప్రోత్సాహకర విదేశీ సంకేతాలతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 137 పాయింట్లు ఎగసి 30,956కు చేరగా.. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 9,105 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జేకే లక్ష్మీ సిమెంట్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో చెన్నై పెట్రోలియం కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జేకే లక్ష్మీ సిమెంట్‌ కౌంటర్‌ లాభాలతో సందడి చేస్తుంటే.. చెన్నై పెట్రోలియం షేరు డీలా పడింది. వివరాలు చూద్దాం..

జేకే లక్ష్మీ సిమెంట్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జేకే లక్ష్మీ సిమెంట్‌ రూ. 99 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 143 శాతం అధికంకాగా..మొత్తం ఆదాయం మాత్రం 10 శాతం క్షీణించి రూ. 1157 కోట్లకు పరిమితమైంది. ఇబిటా రూ. 148 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు ఎగసింది. లాజిస్టిక్‌ వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టుల విక్రయాలు పుంజుకోవడం తదితరాలు లాభదాయకత మెరుగుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో జేకే లక్ష్మీ సిమెంట్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 211 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 218 వరకూ ఎగసింది. బుధవారం సైతం ఈ షేరు 2.5 శాతం పెరిగి రూ. 200 సమీపంలో ముగిసింది.

చెన్నై పెట్రోలియం
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో చెన్నై పెట్రోలియం నికర నష్టం భారీగా పెరిగింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నష్టం రూ. 25 కోట్ల నుంచి రూ. 1625 కోట్లకు ఎగసింది. మొత్తం అమ్మకాలు సైతం 14 శాతం క్షీణించి రూ. 8585 కోట్లకు పరిమితమయ్యాయి. చమురు బ్యారల్‌పై సగటు స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు 3.7 డాలర్ల నుంచి 1.2 డాలర్లకు నీరసించాయి. చమురు ధరల పతనంకారణంగా నిల్వలపై నష్టాలు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. ఇది మార్జిన్లను ప్రభావితం చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో చెన్నై పెట్రోలియం షేరు 5 శాతం పతనమై రూ. 51 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 50 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement