ఐటీలో కొలువుల జోరు..!
2015-16లో 2.75 లక్షల ఉద్యోగావకాశాలు
అంచనాలను మించి నియామకాలు..
నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగంలో నియామకాల జోరు తగ్గడం లేదు. క్రితం అంచనాలను మించి నియామకాలు ఉంటాయని నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చెబుతోంది. 2015-16లో దేశంలో కొత్తగా ఈ రంగంలో 2.30 లక్షల ఉద్యోగావకాశాలు ఉంటాయని నాస్కామ్ గతంలో అంచనా వేసింది. అయితే ఈ సంఖ్య 2.75 లక్షలకు చేరుతుందని అసోసియేషన్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి గురువారం తెలిపారు. ఐఐటీ-హైదరాబాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త నియామకాల్లో 60 శాతం వాటా చిన్న కంపెనీలదేనని చెప్పారు. ఎక్కువ ఉద్యోగావకాశాల కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఆవశ్యకమని అన్నారు.
ఇక చిన్న ప్రాజెక్టులే..
గతేడాదితో పోలిస్తే 2015లో ఐటీ పరిశ్రమ ఆదాయంలో 1.3 లక్షల కోట్ల వృద్ధి నమోదు కావొచ్చని మోహన్‌రెడ్డి తెలిపారు. 2013తో పోలిస్తే 2014లో పరిశ్రమకు 1.04 లక్షల కోట్లు జత కూడిందని చెప్పారు. గతేడాది భారత్‌లో ఐటీ, సర్వీసుల పరిశ్రమ రూ.9.62 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం పెరగడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు ఈ రంగంలో చేరిక ఆదాయ వృద్ధికి కారణమని అన్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ స్థిరంగా, సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని ప్రాం తాల్లో నెలకొన్న ఆటంకాల మూలంగా భారత పరిశ్రమపై దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తుందని వెల్లడిం చారు. అయితే భారీ ప్రాజెక్టుల కాలం పోయిందని, రానున్నది చిన్న ప్రాజెక్టుల రోజులేనని చెప్పారు. ఐటీ, సర్వీసుల పరిశ్రమ 2020 నాటికి 14.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని నాస్కామ్ విశ్వసిస్తోంది.
సమాచారం భద్రం..
ఐటీ పరిశ్రమపై చెన్నై వరదల ప్రభావం గురించి నాస్కామ్ చైర్మన్ స్పందిస్తూ చాలా కంపెనీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయని తెలిపారు. డేటా బ్యాకప్స్‌ను మరోచోట భద్రపరిచాయని చెప్పారు. ఉద్యోగులు కార్యాలయాల్లో విశ్రమించేందుకు వీలుగా కంపెనీలు ఏర్పాట్లు చేశాయని వివరించారు. జనజీవనం స్తంభించడంతో చిన్నా, పెద్దా కంపెనీలు రెండు రోజుల సమయం కోల్పోయాయని గుర్తు చేశారు.