
అనురాగ్ అసతి (సీఈఓ, కబాడీవాలా.కామ్)
సరికొత్త ఆలోచనతో.. ఉపయోగపడే సేవలందించే ఏ సంస్థనైనా ప్రజలు ఆదరిస్తారు. దాన్ని నిరూపిస్తున్నాయి కొన్ని స్టార్టప్‌లు. విద్య, వైద్యం, షాపింగ్, మొబైల్, టెక్నాలజీ.. ఇలా ప్రతి విభాగం నుంచి అలాంటి స్టార్టప్‌లను ఎంపిక చేసి... వాటిపై ప్రత్యేక కథనాలు అందిస్తోంది ‘సాక్షి స్టార్టప్ డైరీ’. దీన్ని చూసి దేశంలోని వివిధ నగరాల నుంచి పలు స్టార్టప్‌లు తమ విజయ గాధను, వివరాలను ‘సాక్షి’కి మెయిల్ చేస్తున్నాయి. ఇలా వస్తున్న మెయిల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది...
వారానికోసారి ప్రచురిస్తుండటం వల్ల కొన్నిటినే ఇవ్వగలుగుతున్నాం. కొంత ఆలస్యమైనా వినూత్న స్టార్టప్‌ల గురించి ప్రచురిస్తామని చెబుతూ... ఈ వారం మీకోసం అలాంటి స్టార్టప్ వివరాలివి...
పాత పేపర్లు కొనే వ్యక్తి వస్తేగానీ ఇంట్లోని చెత్త కరగదు. కొట్టుకెళ్లి అమ్మితే తప్ప ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కదలవు. ఈ రెండు పనులూ కష్టమైనవే. మరి ఆన్‌లైన్ వేదికగా ఆ సమస్య తీరే మార్గం ఉంటే! ఈ ఆలోచననే వ్యాపారంగా మార్చేశాడు అనురాగ్ అసతి. ఈ సంస్థ గురించి ఆయన ఏం చెబుతారంటే...
‘‘భోపాల్ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నా. క్యాంపస్ నుంచి బయటికొచ్చేటప్పుడు పాత నోట్‌బుక్స్, న్యూస్ పేపర్లు, మేగజైన్స్, ప్లాస్టిక్ బాటిళ్ల వంటి చెత్త చాలా పోగైంది. పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ వంటి ముఖ్యమైనవి మాత్రమే ఇంటికి తీసుకెళ్లాలి. మిగతా చెత్తను ఏం చేయాలా అనిపించింది. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఇంటికొచ్చి మరీ చెత్తను తీసుకెళ్లి డబ్బులిచ్చే సంస్థలుంటే బాగుండును కదా! అని కూడా అనిపించింది. అంతే! క్యాంపస్ నుంచి బయటికి రాగానే 2013లో కబాడీవాలా.కామ్‌ను ప్రారంభించాం. వార్తా పత్రికలు, ఇనుము, కాపర్, ప్లాస్టిక్ వంటి వాటిని మేం తీసుకుంటాం. చెత్త రకాన్ని బట్టి ధర కిలోకు రూ. 8 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భోపాల్‌లో సేవలందిస్తున్నాం.
మరో 3-4 నెలల్లో దేశంలోని 15 నగరాల్లో విస్తరించనున్నాం. ఇందుకుగాను రూ.కోటి పెట్టుబడులు పెట్టేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. మేం విస్తరిస్తున్న నగరాల్లో గుర్గావ్, ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్ వంటివి ఉన్నాయి. కొన్ని నగరాల్లో ఫ్రాంచైజీ పద్ధతిలో విస్తరిస్తాం. ప్రస్తుతం రోజుకు సగటున 30-40 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రతి రోజూ 2 టన్నుల చెత్తను కొంటున్నాం. ప్రస్తుతం మా వెబ్‌సైట్‌లో 10 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
ఇళ్లతో పాటు సంస్థలు, సంఘాలు, దుకాణాల నుంచి కూడా చెత్తను కొంటున్నాం. ఐసీఐసీఐ, మ్యాక్స్, పలు ఇంజనీరింగ్ కళాశాల వంటి 30కి పైగా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. కొన్న చెత్తను రీ-సైక్లింగ్ చేసేందుకు పలు నగరాల్లోని రీసైక్లింగ్ యూనిట్లతో ఒప్పందం చేసుకున్నాం. పాత పేపర్లతో నోట్‌బుక్స్ తయారవుతాయి. ఈ-వేస్ట్, ప్టాక్టిక్ వ్యర్థాలను ‘అట్టెరో’ అనే రీసైక్లింగ్ సంస్థకు తరలిస్తున్నాం. వారు వాటిని కరిగించి ఇంధన తయారీకి వాడుతున్నారు’’ అంటూ వివరించారు అనురాగ్.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...