కాకినాడలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్!
ఆ తర్వాత అనంతపురం, తిరుపతిలో..
- ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధులు రూ. 100 కోట్లు
- ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అడ్వైజర్ జె.సత్యనారాయణ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని యువ ప్రతిభావంతుల ఆలోచనలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్రంలో మరో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సలహాదారు జె.సత్యనారాయణ చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి కాకినాడలో స్టార్టప్ టవర్‌ను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత అనంతపురం, తిరుపతిల్లోనూ ఒక్కో సెంటర్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఇంటెల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేట్ ఫర్ డిజిటల్ ఇండియా చాలెంజ్’కు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.
ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధుల కింద రూ.100 కోట్లను ఖర్చు చేస్తామని, ఇందులో సీడ్ క్యాపిటల్ కింద 15% ఇంక్యుబేషన్ నిర్మాణానికి ఖర్చు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాఖలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్‌లో విద్యా, వైద్యం, టెక్నాలజీ వంటి వివిధ విభాగాలకు చెందిన 107 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరాయన్నారు. ‘ఈ ఏడాది ముగింపు నాటికి వీటి సంఖ్యను 500లకు చేరుస్తాం. 2020 కల్లా ఇందులో సుమారు 5,000 స్టార్టప్స్ ఉండేలా ప్రోత్సాహం అందిస్తాం’ అని వివరించారాయన.
డిజిటల్ ఇండియా పోటీకి దరఖాస్తుల ఆహ్వానం!
మీ సాంకేతిక పరిజ్ఞానంతో... సరికొత్త ఆవిష్కరణతో స్థానిక అవసరాలను తీరుస్తున్నారా? అయితే ఈ పోటీ మీకోసమే. దేశంలో సాంకేతిక వినియోగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇంటెల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇన్నోవేషన్ ఫర్ డిజిటల్ ఇండియా పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోటీ విలువ రూ.1.5 కోట్లు. అత్యుత్తమ స్థాయిలో నిలిచే తొలి ముగ్గురు విజేతలకు తలా రూ.20 లక్షలను అందిస్తామని ఇంటెల్ దక్షిణాసియా ఉపాధ్యక్షురాలు దేవయాని ఘోష్ చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్నోవేట్‌ఫర్‌డిజిటల్‌ఇండియా.ఇంటెల్.ఇన్‌కు లాగిన్ అయి ప్రాజెక్ట్‌ను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఈనెల 22. విజేతలను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు.