J.Satyanarayana
-
కాకినాడలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్!
ఆ తర్వాత అనంతపురం, తిరుపతిలో.. - ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధులు రూ. 100 కోట్లు - ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అడ్వైజర్ జె.సత్యనారాయణ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని యువ ప్రతిభావంతుల ఆలోచనలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్రంలో మరో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సలహాదారు జె.సత్యనారాయణ చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి కాకినాడలో స్టార్టప్ టవర్‌ను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత అనంతపురం, తిరుపతిల్లోనూ ఒక్కో సెంటర్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఇంటెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేట్ ఫర్ డిజిటల్ ఇండియా చాలెంజ్’కు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధుల కింద రూ.100 కోట్లను ఖర్చు చేస్తామని, ఇందులో సీడ్ క్యాపిటల్ కింద 15% ఇంక్యుబేషన్ నిర్మాణానికి ఖర్చు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాఖలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లో విద్యా, వైద్యం, టెక్నాలజీ వంటి వివిధ విభాగాలకు చెందిన 107 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరాయన్నారు. ‘ఈ ఏడాది ముగింపు నాటికి వీటి సంఖ్యను 500లకు చేరుస్తాం. 2020 కల్లా ఇందులో సుమారు 5,000 స్టార్టప్స్ ఉండేలా ప్రోత్సాహం అందిస్తాం’ అని వివరించారాయన. డిజిటల్ ఇండియా పోటీకి దరఖాస్తుల ఆహ్వానం! మీ సాంకేతిక పరిజ్ఞానంతో... సరికొత్త ఆవిష్కరణతో స్థానిక అవసరాలను తీరుస్తున్నారా? అయితే ఈ పోటీ మీకోసమే. దేశంలో సాంకేతిక వినియోగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇంటెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇన్నోవేషన్ ఫర్ డిజిటల్ ఇండియా పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోటీ విలువ రూ.1.5 కోట్లు. అత్యుత్తమ స్థాయిలో నిలిచే తొలి ముగ్గురు విజేతలకు తలా రూ.20 లక్షలను అందిస్తామని ఇంటెల్ దక్షిణాసియా ఉపాధ్యక్షురాలు దేవయాని ఘోష్ చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్నోవేట్ఫర్డిజిటల్ఇండియా.ఇంటెల్.ఇన్‌కు లాగిన్ అయి ప్రాజెక్ట్‌ను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఈనెల 22. విజేతలను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు. -
24న స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నిక
సత్యనారాయణ మృతితో ఏర్పడిన ఖాళీ షెడ్యూల్ విడుదల చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ 15వరకు నామినేషన్ల స్వీకరణ 20న ఉపసంహరణ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జె.సత్యనారాయణ (రాజేంద్రనగర్ కార్పొరేటర్) ఆకస్మిక మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక షెడ్యూల్ జారీ అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 24న ఎన్నిక నిర్వహిస్తారు. శనివారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 15వరకు (పనిదినాల్లో) నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసినవారి జాబితాను 16న వెలువరిస్తారు. 17న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఆ తరువాత పోటీకి అర్హులైన వారి పేర్లను వెలువరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆసక్తికరం కానున్న ఎన్నిక.. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉండగా, పదిమంది కార్పొరేటర్లకు ఓ సభ్యుడి వంతున మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్-ఎంఐఎం పరస్పర పొత్తుతో గత జూన్‌లో జరిగిన ఎన్నికల్లో నెగ్గిన వారిలో ఒకరైన రాజేంద్రనగర్ కార్పొరేటర్ సత్యనారాయణ(కాంగ్రెస్) ఇటీవల మరణించారు. ఖాళీ ఏర్పడిన ఈ స్థానానికి తాజాగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాల ఖాళీతో 147 మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అర్హులవుతారు. కాగా, ఇటీవలి కాలంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మరోవైపు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఖాళీ అయిన స్థానం కాంగ్రెస్ కోటాలోది. టీడీపీ-బీజేపీ పొత్తు.. టీడీపీ నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డిరాంబాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కంటే బీజేపీ కార్పొరేటర్ల బలం పెరగడం.. కాంగ్రెస్ నుంచి కొందరు ఇతర పార్టీలకు వెళ్లగా మరికొందరు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలి కాలంలో ఎంఐఎం టీఆర్ఎస్తో దోస్తీ కట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నిక సైతం ఆసక్తికరంగా మారింది. -
మలివిడత పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
ఎన్నికల విధుల్లో ఐదువేల మంది అధికారులు, సిబ్బంది ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: మలివిడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టారు. ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆయా పోలీసు స్టేషన్ల అధికారులకు ఎస్పీలు జె.సత్యనారాయణ, జెట్టి గోపినాథ్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను, సాయుధ బలగాలను, కేంద్ర బలగాలను ఇప్పటికే గ్రామాల్లో మోహరించారు. ఎన్నికల బందోబస్తు నిర్వహించేందుకు ఇద్దరు అదనపు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 300 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 3 వేల మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 700 మంది హోంగార్డులతో పాటు, పది ప్రత్యేక బలగాలు, మూడు సాయుధ బలగాలు, ఒక కంపెనీ కేంద్ర బలగాలను ఆరంచెల విధానంలో విధులు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించేందుకు అర్బన్, రూరల్ ఎస్పీలు ప్రణాళిక రూపొందించారు. మొబైల్పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లు నిరంతరం గస్తీలు నిర్వహిస్తాయి. గతనెల 3వ తేదీనుంచి జిల్లాలో కొనసాగుతున్న చెక్‌పోస్టుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 5.84 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. -
పోలీస్ తనిఖీల్లో రూ.89 లక్షల సీజ్
బాపట్ల, న్యూస్‌లైన్ ఎన్నికల నేపథ్యంలో రూరల్ జిల్లాలో 36 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.89 లక్షల నగదు సీజ్ చేసినట్లు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పొన్నూరు, బాపట్ల, వెదుళ్ళపల్లి చెక్‌పోస్టులను ఆయన పరిశీలించడంతోపాటు సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో బుధవారం డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అధికారులకు తగు సూచనలు ఇచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 36 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా వాటిలో 15 మొబైల్ స్వ్కాడ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి చెక్ పోస్టు వద్ద మూడు విడతలుగా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రూ.89 లక్షలతో పాటు 20 కేజీల వెండి, 43 సెల్ఫోన్లు, రెండు కార్లు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2,500 మద్యం బాటిళ్లను సీజ్ చేయడంతోపాటు 90 బెల్టుషాపులను మూయించినట్లు చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బాపట్ల పరిధిలోని ఐదు గ్రామాలను ఈపాటికే గుర్తించినుట్లు చెప్పారు. రూరల్ జిల్లా పరిధిలోని 1023 మంది రౌడీషీటర్ల, ఐదు వేలమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఎటువంటి అల్లర్లకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదు చేయండి.. పోలీసులు రాజ్యంగానికి లోబడి మాత్రమే పనిచేస్తారని రూరల్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. పోలీసులు ఎటువంటి రాజకీయ నాయకులను లొంగకుండా పనిచేయాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ నోట్లు సముద్ర మార్గంలో వస్తున్నాయనే సమాచారం ఉందని, వాటిని పట్టుకునేందుకు కొన్ని ప్రత్యేక బలగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఫోన్ నం. 0863 -2232348కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఎస్పీతోపాటు డీఎస్పీ ఎన్జే రాజ్‌కుమార్, సీఐలు రామారావు, మల్లికార్జునరావు, ఎస్ఐలు ఉన్నారు. -
మోసపోయాం..
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పండుగరోజు అయినప్పటికీ రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ అందుబాటులో ఉండి బాధితుల ఫిర్యాదులు పరిశీలించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21కి పైగా ఫిర్యాదులు అందాయి. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
గాలిలో ‘ఆత్మ’హత్య కేసు!
నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్: ఆర్నెల్లుగా ఆత్మహత్య కేసు గాలిలో చక్కర్లు కొడుతోంది.. రెండు పోలీసు శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి న్యాయం జరగకపోగా అన్యాయం జరిగే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు విచారణ పేరిట పిలిపించడం, తూతూమంత్రంగా కేసు వ్యవహారాన్ని నడిపించడం, ఆ తరువాత మర్చిపోవడం చేస్తున్నారు. దీంతో మృతుడి ఆత్మ శాంతించకపోగా అతని కుటుంబసభ్యులకు తీవ్ర మనోవేదన మిగులుతోంది. వివరాలిలా ఉన్నాయి... స్థానిక చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన వజ్రగిరి మోజేష్ (25)కు ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన విమలారాణితో 2011లో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది నుంచి విమలారాణి పుట్టింటిలో ఉంటోంది. గత జూలై 23న మోజేష్ చిలకలూరిపేట రోడ్డులోని క్రైస్తవ శ్మశాన వాటిక వద్ద గల రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు భార్య విమలారాణి, ఆమె తరపు బంధువుల వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ఆధారంగా, మృతుడి తండ్రి జయరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసుగా రైల్వే ఎస్ఐ సత్యనారాయణ నమోదు చేశారు. అయితే నిందితులను పట్టుకునేందుకు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత, స్టేషన్లో నెలకొన్న సాంకేతిక లోపాల కారణంగా మోజేష్ ఆత్మహత్య కేసును రైల్వే పోలీసుశాఖ ఉన్నతాధికారులు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణకు బదిలీచేశారు. అక్కడ రెండు నెలల పాటు కేసు ఫైలు పురోగతి లేకుండా ఉండిపోవడంతో మృతుడి తండ్రి జయరావు రూరల్ జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నాడు. స్పందించిన ఆయన వెంటనే సంఘటన జరిగిన ప్రాంతం నరసరావుపేట టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండడంతో ఈ కేసును ఆ ఠాణాకు అక్టోబర్‌లో బదిలీచేశారు. టూ టౌన్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పలుమార్లు మృతుడి బంధువులను విచారణ జరిపారు. నేటివరకు కేసు పురోగతి లేకపోవడంతో మృతుని బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చిన్న చిన్న కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు నానా హైరానా చేసే పోలీసులు ఆత్మహత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
వైద్యులకు సేవాభావం అవసరం
చినకాకాని(మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్: రోగులకు సేవాభావంతో వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ అన్నారు. ఎన్నారై వైద్యశాలలో మంగళవారం అవయవ మార్పిడిపై వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ ఎస్పీ జ్యోతిప్రజ్వలన గావించి సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రులకు ఎక్కువ మంది రోగులు వస్తే అధిక డబ్బులు వస్తాయని వైద్యులు అనుకోవడం తప్పని, సమాజానికి సేవ చేయాలనే భావన కలిగి ఉండాలని సూచించారు. తల్లి తరువాత ప్రాణం పోసేది వైద్యులు, పోలీసులు మాత్రమేనని చెప్పారు. వైద్యులు ప్రాణాలు పోస్తే, పోలీసులు ప్రాణాలను కాపాడతారన్నారు. అవయవ దానం గొప్పది : అర్బన్ ఎస్పీ సదస్సులో అర్బన్ ఎస్పీ జెట్టి గోపినాథ్ మాట్లాడుతూ అవయవదానం ఎంతో గొప్పదానమనే విషయాన్ని వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది విలువైన తమ అవయవాలను, ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోతున్నారని చెప్పారు. పేద కుటుంబాలకు అవయవ దానం మేలు చేకూర్చుతుందని, మృతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తుందని తెలిపారు. అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నారై డెరైక్టర్లు డాక్టర్ మంతెన నర్సరాజు, ముక్కామల సుమతి, డాక్టర్ పోలవరపు రాఘవరావు, డాక్టర్ పిన్నమనేని రామకృష్ణ, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్, డాక్టర్ శ్రీలత, డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మావోయిస్టులకు రూ.9 లక్షలు అందజేత
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: స్వచ్ఛందంగా లొంగిపోయిన ముగ్గురు మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.9 లక్షల నగదును గుంటూరు రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వెల్దుర్తి మండలం గంగులకుంట ఉప్పుతోళ్ళ కుమారి అలియాస్ రేణుక అలియాస్ పుష్ప, ఒప్పిచర్ల గ్రామానికి చెందిన బోమ్మనబోయిన అక్కయ్య అలియాస్ రామేశ్వర్, అతని భార్య గురవమ్మ ఈ ఏడాది జనవరి ఒకటిన స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారిపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ర ల్లో దాడులు, విధ్వసం తదితర మొత్తం 41 కేసులు నమోదయ్యాయి. లొంగిపోయినప్పుడు ఒక్కొక్కరికీ రూ. 5వేల వంతున అత్యవసర సాయంగా అందజేశారు. జనజీవన స్రవంతిలో కలసిపోవడంతో వారిపై ఉన్న రివార్డులతో పాటు, వీలైనంత ఎక్కువగా ప్రభుత్వసాయం అందజేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. స్పందించిన ప్రభుత్వం.. కుమారి, అక్కయ్యలకు రూ.4 లక్షల వంతున, గురవమ్మకు లక్ష మొత్తం రూ.9 లక్షలు మంజూరు చేసింది. దళంలోకి ప్రవేశం ఇలా.. 2003లో గంగులకుంట గ్రామంలో నక్సలైట్లు గ్రామసభ నిర్వహించారు. నక్సల్స్ మాటలకు ప్రభావితమైన కుమారి వారితో పాటు అడవిలోకి వెళ్లి ఉద్యమంలో చేరింది. వెల్దుర్తి, బొల్లాపల్లి ప్రాంతాల్లో పలు దాడులు, హత్యలు, ల్యాండ్‌మైన్ బ్లాస్టింగ్ తదితర కార్యకలాపాల్లో పాల్గొంది. ముఖ్యంగా 2005లో చిలకలూరిపేట పోలీసుస్టేషన్‌పై జరిగిన దాడిలో కీలకంగా పనిచేసింది. అదే ఏడాది మావోయిస్టుల సూచనల మేరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి వెళ్లింది. అక్కడా పలు దాడులు, హత్య కార్యకలాపాల్లో పాల్గొంది. రిక్రూట్మెంట్ చేసుకున్న నూతన మావోయిస్టులకు ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించి శిక్షణ ఇచ్చింది. మొత్తం ఆమెపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10 కేసులు.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఆరు కేసులు నమోదయ్యాయి. అనారోగ్య కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి రహస్య ప్రాంతంలో తలదాచుకుంది. బొమ్మనబోయిన అక్కయ్య 1997లో చంద్రవంక దళంలో చేరి దళ సభ్యునిగా కొనసాగుతున్నాడు. భర్త దళంలో కొనసాగుతుండడంతో అతనిని బయటకు తీసుకువచ్చేందుకు అదే ఏడాది అతని భార్య గురవమ్మ దళంలోకి వెళ్లింది. అనివార్యకారణాల వల్ల భర్తతో పాటే 2004 వరకు కొనసాగింది. అనంతరం నెల్లూరు జిల్లా కావలి మండలం జమ్ములపాలెంలో ఉంటూ తలదాచుకున్నారు. వీరిపై వెల్దుర్తి, దుర్గి, బండ్లమోటు పోలీసుస్టేషన్లలో 25 కేసులు నమోదయ్యాయి. జనజీవన స్రవంతిలో కలిచే మావోయిస్టులకు పునారావాసం కల్పిస్తామని ఎస్పీ సత్యనారాయణ ప్రకటించడంతో ఈ ఏడాది జనవరిలో స్వచ్ఛందంగా లొంగిపోయమని మాజీ మావోయిస్టులు విలేకరులకు తెలిపారు. అనంతరం ముగ్గురికి ప్రభుత్వం నుంచి మంజూరైన నగదు చెక్కులను ఎస్పీ అందజేశారు. నిజాయితీగా ఉంటాం.. తెలిసి తెలియని వయస్సులో అవగాహనరాహిత్యంతో మావోయిస్టు పార్టీలో చేరాం.. చెప్పుకోలేని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం.. ఇంక నుంచి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిజాయితీగా జీవిస్తామని ముగ్గురు మాజీ మావోయిస్టులు తెలిపారు. పోలీసులపై ఉన్న నమ్మకంతో లొంగిపోయామని, వారు నిజాయితీగా వ్యవహరించి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు పార్టీలో రహస్యంగా కొనసాగుతున్నవారు స్వచ్ఛందంగా లొంగిపోతే కచ్చితంగా ఆదుకుని పునారావాసం కల్పిస్తామని ఎస్పీ సత్యనారృయణ తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎస్ ఆర్ఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.