24న స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నిక
- సత్యనారాయణ మృతితో ఏర్పడిన ఖాళీ
- షెడ్యూల్ విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
- 15వరకు నామినేషన్ల స్వీకరణ
- 20న ఉపసంహరణ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జె.సత్యనారాయణ (రాజేంద్రనగర్ కార్పొరేటర్) ఆకస్మిక మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక షెడ్యూల్ జారీ అయింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 24న ఎన్నిక నిర్వహిస్తారు. శనివారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 15వరకు (పనిదినాల్లో) నామినేషన్లు స్వీకరిస్తారు.
నామినేషన్లు దాఖలు చేసినవారి జాబితాను 16న వెలువరిస్తారు. 17న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఆ తరువాత పోటీకి అర్హులైన వారి పేర్లను వెలువరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఆసక్తికరం కానున్న ఎన్నిక..
జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉండగా, పదిమంది కార్పొరేటర్లకు ఓ సభ్యుడి వంతున మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్-ఎంఐఎం పరస్పర పొత్తుతో గత జూన్‌లో జరిగిన ఎన్నికల్లో నెగ్గిన వారిలో ఒకరైన రాజేంద్రనగర్ కార్పొరేటర్ సత్యనారాయణ(కాంగ్రెస్) ఇటీవల మరణించారు. ఖాళీ ఏర్పడిన ఈ స్థానానికి తాజాగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ డివిజన్లు ఖాళీగా ఉన్నాయి.
ఈ మూడు స్థానాల ఖాళీతో 147 మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అర్హులవుతారు. కాగా, ఇటీవలి కాలంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మరోవైపు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఖాళీ అయిన స్థానం కాంగ్రెస్ కోటాలోది. టీడీపీ-బీజేపీ పొత్తు.. టీడీపీ నుంచి పలువురు టీఆర్‌ఎస్‌లో చేరడం, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డిరాంబాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
గతంలో కంటే బీజేపీ కార్పొరేటర్ల బలం పెరగడం.. కాంగ్రెస్ నుంచి కొందరు ఇతర పార్టీలకు వెళ్లగా మరికొందరు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలి కాలంలో ఎంఐఎం టీఆర్‌ఎస్‌తో దోస్తీ కట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నిక సైతం ఆసక్తికరంగా మారింది.