లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యపడుతుందా? ఈ అంశంపై దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఇలా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయాన్నిన్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం పరిశీలించిందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక జవాబిస్తూ ఈ విషయంలో పార్లమెంటరీ స్ధాయీ సంఘం తమ 79 నివేదికలో కొన్ని సిఫార్సులు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు.
నివేదికను సమర్పించే ముందు కేంద్ర ఎన్నికల సంఘంను పార్లమెంటరీ స్ధాయీ సంఘం సంప్రదించిందని, లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనకు కొన్ని సలహాలు, అభిప్రాయాలతో పార్లమెంటరీ స్ధాయీ సంఘం మద్దతు పలికిందని కేంద్ర మంత్రి పిపి చౌదరి తెలిపారు. దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రపతి అనుమతి ఇచ్చిన విషయం వాస్తవమేనా అన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు.. లేదని కేంద్ర మంత్రి జవాబిచ్చారు.
పార్లమెంటరీ స్ధాయీ సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా దేశంలో జాతీయ, ప్రాదేశిక శాసనసభల ఎన్నికలు 5 ఏళ్ల కొకసారి ఏకకాలంలోజరుగుతాయని, అదేవిధంగా అ తర్వాత రెండేళ్లకు మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. స్విడన్‌లో జాతీయ, ప్రాదేశిక శాసనసభలు, స్ధానిక ఎన్నికలు ఎన్నికలు కూడా ఒక నిర్ణీత తేదీన జరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. మిగిలిన దేశాలలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అనుభవాల గురించి సమాచారం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.