కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎన్నికల సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది.
నోటిఫికేషన్ ప్రకారం, బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. అయితే వేడిగాలుల దృష్ట్యా పోలింగ్ శాతాన్ని పెంచేలా ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పొడిగించాలని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ సమయాన్ని మార్చాలని నిర్ణయించింది.
ఈ లోక్‌సభ స్థానాలకు చెందిన వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లలోని కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సంఘం ఇప్పుడు పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేలా నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల పరిధిలోని ఇతర పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.
సాధారణ పోల్ సమయాలు ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు ఉంటాయి. అయితే అవి భూభాగం, సూర్యాస్తమయం సమయం, భద్రతా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment