మాజీ మావోయిస్టులకు రూ.9 లక్షలు అందజేత
Published Sat, Sep 28 2013 1:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: స్వచ్ఛందంగా లొంగిపోయిన ముగ్గురు మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.9 లక్షల నగదును గుంటూరు రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వెల్దుర్తి మండలం గంగులకుంట ఉప్పుతోళ్ళ కుమారి అలియాస్ రేణుక అలియాస్ పుష్ప, ఒప్పిచర్ల గ్రామానికి చెందిన బోమ్మనబోయిన అక్కయ్య అలియాస్ రామేశ్వర్, అతని భార్య గురవమ్మ ఈ ఏడాది జనవరి ఒకటిన స్వచ్ఛందంగా లొంగిపోయారు.
వారిపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ర ల్లో దాడులు, విధ్వసం తదితర మొత్తం 41 కేసులు నమోదయ్యాయి. లొంగిపోయినప్పుడు ఒక్కొక్కరికీ రూ. 5వేల వంతున అత్యవసర సాయంగా అందజేశారు. జనజీవన స్రవంతిలో కలసిపోవడంతో వారిపై ఉన్న రివార్డులతో పాటు, వీలైనంత ఎక్కువగా ప్రభుత్వసాయం అందజేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. స్పందించిన ప్రభుత్వం.. కుమారి, అక్కయ్యలకు రూ.4 లక్షల వంతున, గురవమ్మకు లక్ష మొత్తం రూ.9 లక్షలు మంజూరు చేసింది.
దళంలోకి ప్రవేశం ఇలా..
2003లో గంగులకుంట గ్రామంలో నక్సలైట్లు గ్రామసభ నిర్వహించారు. నక్సల్స్ మాటలకు ప్రభావితమైన కుమారి వారితో పాటు అడవిలోకి వెళ్లి ఉద్యమంలో చేరింది. వెల్దుర్తి, బొల్లాపల్లి ప్రాంతాల్లో పలు దాడులు, హత్యలు, ల్యాండ్‌మైన్ బ్లాస్టింగ్ తదితర కార్యకలాపాల్లో పాల్గొంది. ముఖ్యంగా 2005లో చిలకలూరిపేట పోలీసుస్టేషన్‌పై జరిగిన దాడిలో కీలకంగా పనిచేసింది. అదే ఏడాది మావోయిస్టుల సూచనల మేరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి వెళ్లింది. అక్కడా పలు దాడులు, హత్య కార్యకలాపాల్లో పాల్గొంది. రిక్రూట్‌మెంట్ చేసుకున్న నూతన మావోయిస్టులకు ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించి శిక్షణ ఇచ్చింది. మొత్తం ఆమెపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10 కేసులు.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఆరు కేసులు నమోదయ్యాయి. అనారోగ్య కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి రహస్య ప్రాంతంలో తలదాచుకుంది.
బొమ్మనబోయిన అక్కయ్య 1997లో చంద్రవంక దళంలో చేరి దళ సభ్యునిగా కొనసాగుతున్నాడు. భర్త దళంలో కొనసాగుతుండడంతో అతనిని బయటకు తీసుకువచ్చేందుకు అదే ఏడాది అతని భార్య గురవమ్మ దళంలోకి వెళ్లింది. అనివార్యకారణాల వల్ల భర్తతో పాటే 2004 వరకు కొనసాగింది. అనంతరం నెల్లూరు జిల్లా కావలి మండలం జమ్ములపాలెంలో ఉంటూ తలదాచుకున్నారు. వీరిపై వెల్దుర్తి, దుర్గి, బండ్లమోటు పోలీసుస్టేషన్లలో 25 కేసులు నమోదయ్యాయి. జనజీవన స్రవంతిలో కలిచే మావోయిస్టులకు పునారావాసం కల్పిస్తామని ఎస్పీ సత్యనారాయణ ప్రకటించడంతో ఈ ఏడాది జనవరిలో స్వచ్ఛందంగా లొంగిపోయమని మాజీ మావోయిస్టులు విలేకరులకు తెలిపారు. అనంతరం ముగ్గురికి ప్రభుత్వం నుంచి మంజూరైన నగదు చెక్కులను ఎస్పీ అందజేశారు.
నిజాయితీగా ఉంటాం..
తెలిసి తెలియని వయస్సులో అవగాహనరాహిత్యంతో మావోయిస్టు పార్టీలో చేరాం.. చెప్పుకోలేని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం.. ఇంక నుంచి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిజాయితీగా జీవిస్తామని ముగ్గురు మాజీ మావోయిస్టులు తెలిపారు. పోలీసులపై ఉన్న నమ్మకంతో లొంగిపోయామని, వారు నిజాయితీగా వ్యవహరించి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు పార్టీలో రహస్యంగా కొనసాగుతున్నవారు స్వచ్ఛందంగా లొంగిపోతే కచ్చితంగా ఆదుకుని పునారావాసం కల్పిస్తామని ఎస్పీ సత్యనారృయణ తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎస్ ఆర్‌ఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement