పోలీస్ తనిఖీల్లో రూ.89 లక్షల సీజ్
బాపట్ల, న్యూస్‌లైన్
ఎన్నికల నేపథ్యంలో రూరల్ జిల్లాలో 36 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.89 లక్షల నగదు సీజ్ చేసినట్లు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పొన్నూరు, బాపట్ల, వెదుళ్ళపల్లి చెక్‌పోస్టులను ఆయన పరిశీలించడంతోపాటు సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో బుధవారం డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
అధికారులకు తగు సూచనలు ఇచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 36 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా వాటిలో 15 మొబైల్ స్వ్కాడ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి చెక్ పోస్టు వద్ద మూడు విడతలుగా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రూ.89 లక్షలతో పాటు 20 కేజీల వెండి, 43 సెల్‌ఫోన్లు, రెండు కార్లు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
2,500 మద్యం బాటిళ్లను సీజ్ చేయడంతోపాటు 90 బెల్టుషాపులను మూయించినట్లు చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బాపట్ల పరిధిలోని ఐదు గ్రామాలను ఈపాటికే గుర్తించినుట్లు చెప్పారు.
రూరల్ జిల్లా పరిధిలోని 1023 మంది రౌడీషీటర్ల, ఐదు వేలమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఎటువంటి అల్లర్లకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫిర్యాదు చేయండి..
పోలీసులు రాజ్యంగానికి లోబడి మాత్రమే పనిచేస్తారని రూరల్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. పోలీసులు ఎటువంటి రాజకీయ నాయకులను లొంగకుండా పనిచేయాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
నకిలీ నోట్లు సముద్ర మార్గంలో వస్తున్నాయనే సమాచారం ఉందని, వాటిని పట్టుకునేందుకు కొన్ని ప్రత్యేక బలగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఫోన్ నం. 0863 -2232348కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఎస్పీతోపాటు డీఎస్పీ ఎన్‌జే రాజ్‌కుమార్, సీఐలు రామారావు, మల్లికార్జునరావు, ఎస్‌ఐలు ఉన్నారు.