విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరికొంత బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 171 పాయింట్లు ఎగసి 35,087కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు పుంజుకుని 10,353 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్డర్లను సంపాదించినట్లు వెల్లడించడంతో కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి కల్పతరు లాభాలతో సందడి చేస్తుంటే.. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ కళ తప్పింది. వివరాలు చూద్దాం..
కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్
ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతోపాటు దేశీ కంపెనీల నుంచి తాజాగా కాంట్రాక్టులు పొందినట్లు మౌలిక సదుపాయాల సంస్థ కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్ పేర్కొంది. వీటితోపాటు అనుబంధ సంస్థ ద్వారా యూరోప్‌లోనూ విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగంలో ఆర్డర్లను దక్కించుకున్నట్లు తెలియజేసింది. వీటి సంయుక్త విలువను రూ. 956 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో కల్పతరు పవర్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 3 శాతం పెరిగి రూ. 223 వద్ద ట్రేడవుతోంది.
గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పొగాకు ఉత్పత్తుల సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 20 శాతం తక్కువకాగా.. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 622 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం పతనమై రూ. 987 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment