హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్, ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీ సంస్థ ‘కెంట్ ఆర్‌వో సిస్టమ్స్’... కిచెన్ అప్లయన్సెస్ శ్రేణిని విస్తృతం చేసే పనిలో ఉంది. ఇప్పటికే కంపెనీ గ్రైండర్/బ్లెండర్, టోస్టర్, జ్యూసర్, శాండ్‌విచ్ మేకర్, ఎలక్ట్రిక్ రైస్ కుకర్, ఫ్రైయర్, దోస మేకర్ వంటి ఉపకరణాలను విక్రయిస్తోంది. డిమాండ్ ఉన్న అప్లయన్సెస్ తయారీలోకి ప్రవేశిస్తామని కెంట్ ఆర్‌వో సిస్టమ్స్ సీఎండీ మహేష్ గుప్త తెలిపారు.
సోమవారమిక్కడ నూతన శ్రేణి ఆర్‌వో వాటర్ ప్యూరిఫయర్లను ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 20 మంది సిబ్బందితో కూడిన పరిశోధన, అభివృద్ధి విభాగం కొత్త అప్లయన్సెస్ రూపకల్పనలో నిమగ్నమైందని ఆయన తెలియజేశారు. డిజిటల్ పవర్ ఉపకరణాలను దశల వారీగా ప్రవేశపెడుతున్నామని, వీటి ఆధారంగా ఇంటర్నెట్ ఆధారిత అప్లయన్సెస్ విడుదల చేయడం సులభమని చెప్పారు.
మూడేళ్లలో రూ.1,500 కోట్లు..: కెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.950 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయగలమని ఆశిస్తోంది. ‘మూడేళ్లలో రూ.1,500 కోట్లకు చేరుకుంటాం. టర్నోవరులో 10 శాతం నాన్–ప్యూరిఫయర్ విభాగం నుంచి సమకూరుతోంది.
రానున్న రోజుల్లో ఈ విభాగం వాటా మరింత అధికం కానుంది. రూ.1,800 కోట్ల వ్యవస్థీకృత ఆర్‌వో వాటర్ ప్యూరిఫయర్ల మార్కెట్లో కెంట్‌కు 40 శాతం వాటా ఉంది. 19 రకాల వాటర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తున్నాం’ అని వివరించారు. కాగా, నూతన శ్రేణి నెక్స్‌ట్‌జెన్ ఆర్‌వో వాటర్ ప్యూరిఫయర్ల ధర రూ.14,500–19,000 మధ్య ఉంది. బ్యాక్టీరియా, ఇతర మలినాలు చేరకుండా వాటర్ ట్యాంకులో అల్ట్రా వయోటెల్ రక్షణ ఏర్పాటు ఉంది. అలాగే ప్యూరిటీ వివరాలు తెలిపే డిజిటల్ డిస్‌ప్లే పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment