కొత్త వేదికలతో కేరళ టూరిజం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏటా అయిదారు కొత్త ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నట్టు కేరళ టూరిజం వెల్లడించింది. ప్రస్తుతం 100కుపైగా కేంద్రాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కె.పి.నందకుమార్ తెలిపారు. టూర్ ఆపరేటర్లు, ఏజెన్సీలతో కేరళ టూరిజం రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైల్డ్‌లైఫ్, హిల్ స్టేసన్స్, బీచెస్, బ్యాక్‌వాటర్స్ వంటివి ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తు చేశారు.
ఇందుకోసం పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల వారు వివాహాలను కేరళలో జరపడం పెరుగుతోందని అన్నారు. ఇటువంటివి ఏటా 500లకుపైగా జరుగుతున్నాయని తెలిపారు. గతేడాది 10 లక్షల మంది విదేశీ, 1.35 కోట్ల మంది దేశీయ పర్యాటకులు కేరళలో అడుగు పెట్టారని చెప్పారు. 2015తో పోలిస్తే గతేడాది సెప్టెంబరులో పర్యాటకుల సంఖ్య 5–6 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. విభిన్న పర్యాటక ప్రదేశాలతో టూరిస్టుల సంఖ్య పరంగా దేశంలో కేరళ తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు.