కోల్‌కతా: బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ నష్టాలొస్తున్న తన టైర్ల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా (బిర్లా టైర్స్) విడగొట్టనుంది. ఫలితంగా కంపెనీ విలువ మరింత పెరగగలదని, మూలధన నిధులు సమీకరణ మరింత సులభమవుతుందని సంస్థ భావిస్తోంది. ఈ కంపెనీ చేపట్టిన రెండో భారీ పునర్వ్యస్థీకరణ ఇది. డీమెర్జర్‌లో భాగంగా ఒక్కో కేశోరామ్ ఇండస్ట్రీస్ షేర్‌కు రూ.10 ముఖ విలువ గల ఒక్కో బిర్లా టైర్స్ షేర్ లభిస్తుంది. టైర్ల వ్యాపారానికే అంకితమైన మేనేజ్‌మెంట్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆ వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ఈ డీ మెర్జర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం పొందాల్సి ఉంది. డీమెర్జర్ అనంతరం సిమెంట్‌వ్యాపారం కేశోరామ్ ఇండస్ట్రీస్ కింద కొనసాగుతుంది.
రూ. 1,000 కోట్ల రుణం బదిలీ...
కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు ప్రస్తుతం ఉన్న రూ.1,000 కోట్ల రుణాన్ని బిర్లా టైర్స్ కంపెనీకి బదిలీ చేసే అవకాశాలున్నాయని కేశోరామ్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) రాధాకృష్ణన్ చెప్పారు. టైర్ల వ్యాపారంలో కొనసాగుతామని, ఈ వ్యాపారంలో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామి సహకారంతో అధిక మార్జిన్లు వచ్చే ఆటోమోటివ్ రేడియల్ టైర్ల విభాగంలోకి బిర్లా టైర్స్ ప్రవేశించే అవకాశాలున్నాయి. రెండేళ్ల క్రితం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ హరిద్వార్ సమీపంలోని లక్సర్ టైర్ ప్లాంట్‌ను జేకే టైర్స్‌కు రూ.2,000 కోట్లకు విక్రయించింది. ఈ విక్రయం కారణంగా కేశోరామ్ కంపెనీ రుణ భారం భారీగా తగ్గింది. కాగా ప్రత్యేక కంపెనీగా విడిపోయిన బిర్లా టైర్స్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,453 కోట్లుగా ఉంది. ఇది మొత్తం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఆదాయంలో 39 శాతానికి సమానం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.67 కోట్లుగా ఉన్న టైర్ల విభాగం నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపై రూ.129 కోట్లకు పెరిగాయి.
కేశోరామ్ నుంచి విడిగా టైర్ల విభాగం
Published Wed, Dec 5 2018 2:27 AM | Last Updated on Wed, Dec 5 2018 2:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment