Kesoram Industries
-
మిస్ యూ ‘బాబు సాబ్’
సాక్షి, పాలకుర్తి(కరీంనగర్) : ‘బాబు సాబ్’ బసంత్‌నగర్ పరిసర ప్రాంతంలో ఈ పేరు అంటేనే ఒక గౌరవం. కేశోరాం గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన బసంత్‌కుమార్ బిర్లాను స్థానికంగా అందరూ పిలుచుకునే పేరు బాబు సాబ్. గురువారం అనారోగ్యంతో బాబుసాబ్ మృతి చెందాడన్న విషయం తెలిసి బసంత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమను స్థాపించి దేశ వ్యాప్తంగా ఎన్నో వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు బాసటగా నిలిచిన గొప్ప వ్యక్తి బాబుసాబ్. పరిశ్రమను స్థాపించడమే కాకుండా కంపెనీ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు చాలా గ్రామాల్లో వందల సంఖ్యలో దేవాలయాలను నిర్మించారు. మరో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలవబడే రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్రవేసి ఎంతో మంది పేదల గుండెల్లో దైవంగా కొలువబడ్డ మహోన్నత వ్యక్తి బసంత్‌కుమార్ బిర్లా. అలాంటి వ్యక్తి మరణించడంతో స్థానికంగా తమ కుటుంబసభ్యుల్ని కోల్పోయామనే విధంగా స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో పాటు కర్మాగారం ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న వారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ బాబుసాబ్ను మననం చేసుకుంటున్నారు. గురువారం కేశోరాం సూపర్‌బజార్ గల షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బాబుసాబ్ మృతికి సంతాపం ప్రకటించారు. దీంతో పాటు కర్మాగారం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టాఫ్‌కాలనీలోని ఇండియా మిషన్ సెకండరీ పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆయన పేరు మీదనే. ప్రస్తుతం బసంత్నగర్గా పిలవబడుతున్న ప్రాంతం గతంలో ఈసాలతక్కళ్ళపల్లిగా పిలువబడేది. 1969లో స్థానికంగా బసంత్‌కుమార్ బిర్లా కేశోరాం కర్మాగారాన్ని స్థాపించడంతో ఈ ప్రాంతానికి ఆయన పేరును పెట్టి బసంత్నగర్గా మార్చారు. దీంతో పాటు బసంత్‌నగర్‌ను ఆనుకుని కన్నాల గ్రామపంచాయతీలో గల ఓ కాలనీకి తన తండ్రి ఘనశ్యాందాస్ బిర్లా పేరు మీద జీడీనగర్ అని పెట్టారు. ప్రస్తుతం జీడీనగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. దీంతో పాటు పాలకుర్తి గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన శ్రీబుగ్గ రామలింగేశ్వరస్వామి పేర్లలోని అక్షరాలను కలిపి కేశోరాం అని కంపెనీకి పేరు పెట్టాడని, దీని ఆధారంగానే ఆయనకు దేవుడి మీద ఏ స్థాయిలో భక్తి ఉందో చెప్పవచ్చునని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రత్యేక విమానంలో బసంత్‌నగర్‌కు.. బసంత్‌కుమార్ బిర్లా ప్రతియేడు బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం పర్యవేక్షణకై ప్రత్యేక విమానంలో వచ్చేవారు. ఇందుకోసం బసంత్‌నగర్ గ్రామ శివారుతో పాటు, పెద్దపల్లి మండలం కురుమపల్లి గ్రామ శివారులోని దాదాపు వంద ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుని విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికొకసారి బిర్లా బాబు బసంత్‌నగర్ కర్మాగారానికి సందర్శించే వారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చేవారు. బసంత్‌నగర్ సందర్శనకు వచ్చినపుడు కర్మాగారంతో పాటు మైన్స్, ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన బుగ్గ రామస్వామి ఆలయం, స్టాఫ్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వరాలయం, శివాలయం, కేశోరాం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డెయిరీ ఫాంను సందర్శించి అందులోని గోవులకు పూజలు చేసేవారు. కానీ గత ఏడేళ్లుగా వయోభారంతో పాటు ఆరోగ్యం సహకరించని కారణంగా బీకే బిర్లా బసంత్‌నగర్‌కు రాలేదు. కేశోరాం కర్మాగారం నిర్వహణ బాధ్యతలను కూడా తన మనుమరాలైన మంజుశ్రీకి అప్పగించారు. నేడు సంతాప సభ బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో శుక్రవారం బసంత్‌కుమార్ బిర్లా సంతాప సభ నిర్వహించనున్నారు. ఈమేరకు కంపెనీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కోల్‌కత్తాలో బీకే బిర్లా అంత్యక్రియలు ముగిసిన అనంతరం సంతాపసభ నిర్వహించనున్నారు. -
ప్రముఖ పారిశ్రామికవేత్త బీకే బిర్లా కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ , కుమార్ మంగళం బిర్లా తాత బసంత్ కుమార్ బిర్లా (బీకే బిర్లా 98) బుధవారం ముంబైలో కన్నుమూశారు. బి.కె.బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల నడుపుతున్న కృష్ణార్పణ్ ఛారిటీ ట్రస్ట్ చైర్మన్ కూడా అయిన బిర్లా ఖతార్‌లోని బిర్లా పబ్లిక్ స్కూల్, ముంబై సమీపంలోని కళ్యాణ్‌లో బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ స్థాపించారు. బిర్లాకు ఇద్దరు కుమార్తెలు జయశ్రీ మెహతా, మంజుశ్రీ ఖైతాను ఉన్నారు. అయితే కుమారుడు ఆదిత్య విక్రం బిర్లా, (కుమార మంగళం తండ్రి)1995, అక్టోబరులో మరణించారు. ప్రముఖ దాత ఘనశ్యామ్ దాస్ చిన్న కుమారుడైన బీకేబిర్లా పత్తి, సిమెంట్, ప్లై వుడ్, పేపర్, విస్కోస్, పాలిస్టర్, నైలాన్, పేపర్ షిప్పింగ్, టైర్‌కార్డ్, టీ, కాఫీ, ఏలకులు, రసాయనాలు తదితర రంగాల్లో కీలక వ్యాపారాలను కలిగి ఉన్నారు. 15 ఏళ్ల ప్రాయం నుంచే పలు వ్యాపార కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించిన బీకే బిర్లా కేశోరాం ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా తన కరియర్‌ను ప్రారంభించారు. బీకే బిర్లా మృతిపట్ల పలువురు పరిశ్రమ పెద్దలు, ఇతర పారిశ్రామిక వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వక్తం చేశారు. వ్యాపార రంగానికి బిర్లా ఎనలేని సేవలందించారంటూ తమ సంతాపాన్ని ప్రకటించారు. -
కేశోరామ్ నుంచి విడిగా టైర్ల విభాగం
కోల్‌కతా: బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ నష్టాలొస్తున్న తన టైర్ల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా (బిర్లా టైర్స్) విడగొట్టనుంది. ఫలితంగా కంపెనీ విలువ మరింత పెరగగలదని, మూలధన నిధులు సమీకరణ మరింత సులభమవుతుందని సంస్థ భావిస్తోంది. ఈ కంపెనీ చేపట్టిన రెండో భారీ పునర్వ్యస్థీకరణ ఇది. డీమెర్జర్‌లో భాగంగా ఒక్కో కేశోరామ్ ఇండస్ట్రీస్ షేర్‌కు రూ.10 ముఖ విలువ గల ఒక్కో బిర్లా టైర్స్ షేర్ లభిస్తుంది. టైర్ల వ్యాపారానికే అంకితమైన మేనేజ్మెంట్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆ వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ఈ డీ మెర్జర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం పొందాల్సి ఉంది. డీమెర్జర్ అనంతరం సిమెంట్వ్యాపారం కేశోరామ్ ఇండస్ట్రీస్ కింద కొనసాగుతుంది. రూ. 1,000 కోట్ల రుణం బదిలీ... కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు ప్రస్తుతం ఉన్న రూ.1,000 కోట్ల రుణాన్ని బిర్లా టైర్స్ కంపెనీకి బదిలీ చేసే అవకాశాలున్నాయని కేశోరామ్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రాధాకృష్ణన్ చెప్పారు. టైర్ల వ్యాపారంలో కొనసాగుతామని, ఈ వ్యాపారంలో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామి సహకారంతో అధిక మార్జిన్లు వచ్చే ఆటోమోటివ్ రేడియల్ టైర్ల విభాగంలోకి బిర్లా టైర్స్ ప్రవేశించే అవకాశాలున్నాయి. రెండేళ్ల క్రితం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ హరిద్వార్ సమీపంలోని లక్సర్ టైర్ ప్లాంట్‌ను జేకే టైర్స్‌కు రూ.2,000 కోట్లకు విక్రయించింది. ఈ విక్రయం కారణంగా కేశోరామ్ కంపెనీ రుణ భారం భారీగా తగ్గింది. కాగా ప్రత్యేక కంపెనీగా విడిపోయిన బిర్లా టైర్స్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,453 కోట్లుగా ఉంది. ఇది మొత్తం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఆదాయంలో 39 శాతానికి సమానం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.67 కోట్లుగా ఉన్న టైర్ల విభాగం నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపై రూ.129 కోట్లకు పెరిగాయి. -
జేకే గ్రూప్ చేతికి క్యావెండిష్ ఇండస్ట్రీస్
డీల్ విలువ రూ. 2,200 కోట్లు న్యూఢిల్లీ: జేకే గ్రూప్ తాజాగా కేశోరామ్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ క్యావెండిష్ ఇండస్ట్రీస్‌ను(సీఐఎల్) కొనుక్కోనుంది. ఈ డీల్ విలువ రూ. 2,200 కోట్లు. హరిద్వార్‌లోని ప్లాంటులో సీఐఎల్ టైర్లు, ట్యూబులు, ఫ్లాప్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. సీఐఎల్‌లో పూర్తి వాటాల కొనుగోలుకు సంబంధించి కేశోరామ్ ఇండస్ట్రీస్‌తో జేకే గ్రూప్‌లో భాగమైన జేకే టైర్, జేకే ఆసియా పసిఫిక్ సింగపూర్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొనుగోలు అనంతరం జేకే టైర్‌కి సీఐఎల్‌లో సింహభాగం వాటాలతో పాటు గణనీయంగా మేనేజ్మెంట్ అధికారాలు దఖలుపడతాయి. ట్రక్, బస్సు రేడియల్స్ విభాగంలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని జేకే టైర్ చైర్మన్ రఘుపతి సింఘానియా తెలిపారు. డీల్ మొత్తంలో జేకే టైర్ నికరంగా రూ. 450 కోట్లు సమకూర్చవచ్చని అంచనా. దేశీయంగా టాప్ 3 టైర్ల తయారీ కంపెనీల్లో జేకే టైర్ కూడా ఒకటి.