
అ్రల్టాటెక్ సిమెంట్ బోర్డ్ నిర్ణయం
1:52 నిష్పత్తిలో షేర్ల జారీకి ఓకే
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ బోర్డు కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు చెందిన సిమెంట్ బిజినెస్ విడదీతకు నిర్ణయించింది. దీంతో 2025 మార్చి1 నుంచి విడదీత పథకం అమలుకానున్నట్లు అ్రల్టాటెక్ సిమెంట్ పేర్కొంది. దీని ప్రకారం కేశోరామ్ ఇండస్ట్రీస్ నుంచి సిమెంట్ బిజినెస్‌ను విడదీసి అ్రల్టాటెక్ సిమెంట్‌లో విలీనం చేస్తారు. మంగళవారం సమావేశమైన బోర్డు 1:52 నిష్పత్తిలో ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అ్రల్టాటెక్ వెల్లడించింది. కేశోరామ్ ఇండస్ట్రీస్ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ 52 షేర్లకుగాను 1 అ్రల్టాటెక్ షేరును జారీ చేస్తారు. కేశోరామ్ ప్రిఫరెన్స్ వాటాదారులకు 7.3 శాతంతో 54.86 లక్షల మార్పిడికి వీలుకాని రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(ఎన్‌సీఆర్‌పీ)ను జారీ చేయనుంది.
90 లక్షల(5 శాతం) క్యుములేటివ్ ఎన్‌సీఆర్‌పీల స్థానే వీటిని కేటాయించనుంది. అంతేకాకుండా 19.19 లక్షల ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల స్థానే 7.3 శాతంతో 8.64 లక్షల ఎన్‌సీఆర్‌పీలను జారీ చేయనుంది. ఈ పథకానికి 2023 నవంబర్ 30న రెండు కంపెనీల బోర్డులూ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆపై సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు సైతం లభించాయి.
కాగా.. సిమెంట్ బిజినెస్ విడదీత తదుపరి ట్రాన్స్‌పరెంట్ పేపర్, రేయాన్ విభాగాలతో కేశోరామ్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మరోపక్క అ్రల్టాటెక్‌కు వార్షికంగా 7 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యం జత కలవనుంది. ప్రస్తుత అ్రల్టాటెక్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 183 మిలియన్ టన్నులుకాగా.. సిమెంట్ తయారీలో చైనా వెలుపల ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది.