కైనటిక్ నుంచి ఎలక్ట్రిక్ 3 వీలర్
న్యూఢిల్లీ: పుణేకి చెందిన ‘కైనటిక్ గ్రూప్’ అనుబంధ కంపెనీ ‘కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్’ తాజాగా ‘కైనటిక్ సఫర్’ అనే ఎలక్ట్రిక్ 3 వీలర్ వాహనాన్ని మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.38 లక్షలు (ఆన్ రోడ్ ఢిల్లీ). దీంతో కంపెనీ ఎలక్ట్రానిక్ వాహన విభాగంలోకి ప్రవేశించినట్లయ్యింది. కైనటిక్ కంపెనీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.400 కోట్ల విలువైన ఆర్డరును కైవసం చేసుకుంది. కంపెనీ ఈ ఆర్డర్‌లో భాగంగా 27,000 యూనిట్ల ‘కైనటిక్ సఫర్’ వాహనాలను ఆ ప్రభుత్వానికి సరఫరా చేయనున్నది. ప్రజలకు అందుబాటు ధరల్లో, కాలుష్య రహిత వాహనాల తయారీకి తాము ఎంతగానో శ్రమించామని ‘కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్’ కంపెనీ సీఈవో సులజా ఫిరోడియా మోత్వాని తెలిపారు.
‘కైనటిక్ సఫర్’ ప్రత్యేకతలు
‘కైనటిక్ సఫర్’ను ఒకసారి చార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల దూరం వెళ్తుందని మోత్వాని తెలిపారు. అలాగే గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని చెప్పారు. వాహనంలో డ్రైవర్‌తోపాటు మరో నలుగురు ప్రయాణించవచ్చని తెలిపారు. హోమ్ డెలివరీస్ కోసం ఈ-కార్ట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.