ఎల్‌అండ్‌టీ లాభం 46% అప్
క్యూ1లో లాభం రూ.893 కోట్లు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ జూన్ క్వార్టర్ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నాయి. లాభం ఏకంగా 46 శాతం వృద్ధితో రూ.893 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.610 కోట్లు కావడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.23,990 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న ఆదాయంతో పోలిస్తే 10 శాతం అధికం. అంతర్జాతీయ వ్యాపార విభాగాల ద్వారా వచ్చిన ఆదాయం ఈ కాలంలో రూ.8,233 కోట్లుగా ఉంది.
సంస్థ మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ కార్యకలాపాల వాటా 34%. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ జూన్ క్వార్టర్లో రూ.26,352 కోట్ల ఆర్డర్లను సంపాదించించినట్టు కంపెనీ పేర్కొంది. వీటిలో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.7,885 కోట్లు (30%)గా ఉంది. ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగం నుంచి పెద్ద ఆర్డర్లు లభించాయని కంపెనీ వెల్లడించింది. జూన్ 30 నాటికి కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.2,62,860 కోట్లుగా ఉంది.
వీటిలో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 26 శాతం. గతేడాది ఇదే కాలంలో ఉన్న ఆర్డర్ బుక్ విలువ కంటే 2 శాతం అధికం. జీఎస్టీకి మారడం, రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం, ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ తదితర సంస్కరణలు వృద్ధికి ఊతమిస్తాయని కంపెనీ పేర్కొంది. మంచి వర్షపాత అంచనాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వృద్ధి, ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపు, తక్కువ వడ్డీ రేట్లు డిమాండ్‌ను పెంచుతాయని, జీడీపీకి ఉత్ప్రేరకంగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్ర వారం ఎల్‌అండ్‌టీ షేరు ధర బీఎస్‌ఈలో 1.96% లాభపడి రూ. 1,159 వద్ద ముగిసింది.