
సాక్షి, న్యూఢిల్లీ : గగనవీధిలో ప్రయాణిస్తున్న విమానంలో పర్సనల్ ఎలక్ట్రిక్ డివైజ్ పేలిన ఘటన మరోసారి చోటుచేసుకుంది. తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ల్యాప్‌టాప్ నుంచి మంటల చెలరేగాయి. శనివారం(నవంబర్ 11)న ఈ ప్రమాదం జరిగింది. 6ఈ-445(వీటీ-ఐజీవీ) విమానంలో బ్లాక్ బ్యాగ్ నుంచి కాలుతున్న వాసన వచ్చినట్టు ప్యాసెంజర్లు రిపోర్టు చేశారు. వెంటనే అలర్ట్ అయిన విమానశ్రయ సిబ్బంది స్ప్రేతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాక ప్రయాణికుల సీట్లను వేరే ప్రాంతాలకు మార్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ల్యాప్‌టాప్‌ను వాటర్ కంటైనర్‌లో ఉంచారు. ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు.
''2017 నవంబర్ 11న తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న 6ఈ-445 ఇండిగో విమానంలో పొగ వాసన వచ్చింది. 24ఆర్‌హెచ్ సీటు హ్యాట్-ర్యాక్ నుంచి మంటలు రావడం విమాన సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పైలెట్-ఇన్-కమాండ్‌కు చేరవేశారు. ముందస్తు జాగ్రత్తలు మేరకు వెనువెంటనే ప్రయాణికులనే వేరే సీట్లలోకి సర్దుబాటు చేసి, హ్యాండ్‌బ్యాగ్‌లో కాలుతున్న ల్యాప్‌టాప్‌ను అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నీళ్లతో నింపిన కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందర్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేశాక, డీజీసీఏకు స్వచ్ఛందంగా ఈ విషయాన్ని వెల్లడించాం'' అని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. తమకు సహకరించిన ప్రయాణికులందరికీ ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ప్రయాణికుల భద్రతకు తాము ఎంతో ప్రాముఖ్యత ఇస్తామని, ఈ విషయంలో తాము రాజీపడమని పేర్కొంది. గత నెలలో కూడా ఢిల్లీ-ఇండోర్ వెళ్తున్న ఓ విమానంలో మొబైల్ ఫోన్ పేలి విమానంలో మంటలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment