పీఎఫ్‌సీకి భారీ నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,409 కోట్ల భారీ నికరనష్టాన్ని చవిచూసింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 1,259 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అయితే తాజాగా ముగిసిన త్రైమాసికంలో వడ్డీ ఆదాయం తగ్గడం, మొండిబకాయిలకు కేటాయింపులు పెరగడంతో నష్టాలు వచ్చాయి. సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2016–17 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను సిఫార్సుచేయరాదని నిర్ణయించింది. ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆదాయం రూ. 6,787 కోట్ల నుంచి రూ. 5,797 కోట్లకు తగ్గింది.
పరపతి నియంత్రణల ప్రకారం రూ. 35,994 కోట్ల విలువైన స్టాండర్డ్ ఆస్తుల్ని (కంపెనీ ఇచ్చిన రుణాలు) పునర్‌వ్యవస్థీకరించిన ఆస్తులుగా వర్గీకరించింది. దాంతో ఈ రుణాలపై కేటాయింపులు 0.35 శాతం నుంచి 4.25 శాతానికి పెరిగాయి. దాంతో తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభనష్టాల ఖాతాలో రూ. 1,404 కోట్ల తరుగు ఏర్పడింది. అలాగే రూ. 8,284 కోట్ల మేర రెండు ఎన్‌పీఏలు ఏర్పడటంతో ఇందుకు సంబంధించి కూడా రూ. 963 కోట్లు కేటాయించాల్సివచ్చింది. రూ. 5,000 కోట్లకు పైబడిన మొండి బాకీల కోసం మరో రూ. 1,083 కోట్లు కేటాయింపులు జరిపినట్లు పీఎఫ్‌సీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది.