PFC
-
పీఎఫ్సీఎస్, డీఎఫ్‌సీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాలు (పీఎఫ్సీఎస్), జిల్లా స్థాయి మత్స్యకారుల సహకార సంఘాలకు (డీఎఫ్‌సీఎస్) ఎన్నికలు నిర్వహించాలని సహకార శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్‌ను అనుమతిస్తూ, విచారణ ముగించింది. గ్రామస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మత్స్యకారుల సహకార సంఘాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో హనుమకొండకు చెందిన డీఎఫ్‌సీఎస్ చీఫ్ ప్రమోటర్ బుస్సా మల్లేశంతో పాటు మరో ఏడుగురు చీఫ్ ప్రమోటర్లు పిటిషన్ దాఖలు చేశారు.12 జిల్లాల పరిధిలో ఎన్నికలు నిర్వహించారని, మిగిలిన 21 జిల్లాల పరిధిలో కూడా వెంటనే నిర్వహించాలని కోరుతూ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ రాష్ట్ర ఎన్నికల అథారిటీకి సెప్టెంబర్ 23న వినతిపత్రం సమర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అందుకే మరో మార్గంలేక హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. పిటిషనర్లు వినతిపత్రం సమర్పించినా అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదని వారి తరఫున న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపించారు.ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సెప్టెంబర్ 9న సహకార మంత్రి సమావేశం నిర్వహించి సమస్యను వివరిస్తూ, ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించాలని చెప్పారని పేర్కొన్నారు. అయినా అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సహకార శాఖ అధికారులను ఆదేశిస్తూ, విచారణ ముగించారు. -
‘పాలమూరు– రంగారెడ్డి’కి రూ.13,500 కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.13,500 కోట్ల అదనపు రుణం ఇవ్వడానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. చెరో రూ.6,750 కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే, పర్యావరణ అనుమతుల్లేని కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేతోపాటు ఇతర న్యాయ వివాదాలు తొలగిన తర్వాతే రుణాలు ఇస్తామని నిబంధన పెట్టాయి. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, అనుమతులు లభించిన తర్వాత స్టే తొలగిపోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ.920.85 కోట్ల జరిమానా విధిస్తూ గత నెలలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది. స్టేతో ఆగిన రూ.3వేల కోట్ల రుణం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణాలను పీఎఫ్సీ నుంచి సమీకరించేందుకు గతంలో ఒప్పందం జరగగా, ఇప్పటివరకు రూ.7 వేల కోట్లను పీఎఫ్సీ విడుదల చేసింది. ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ విధించిన స్టే తొలగిన తర్వాతే మిగిలిన రూ.3వేల కోట్లను విడుదల చేస్తామని పీఎఫ్సీ పేర్కొంటోంది. రోజుకు ఒక టీఎంసీ తరలింపు న్యాయవివాదాలతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిలిచిపోయినా, అప్పటికే రోజుకు ఒక టీఎంసీ సామర్థ్యంతో కృష్ణా జలాల తరలింపునకు వీలుగా పనులు జరిగినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 67 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మిస్తుండగా, తొలి నాలుగు రిజర్వాయర్లయిన నార్లపూర్, ఏదుల, వట్టేం, కరివేనలకు శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు వీలుగా పంపులు, మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. చివరి రెండు రిజర్వాయర్లు అయిన ఉదండపూర్, లక్ష్మీదేవిపల్లిలకు నీళ్లను పంపింగ్ చేసే పంపులు, మోటార్లతోపాటు సొరంగం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఉదండపూర్ జలాశయం నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను పంపింగ్ చేసేందుకు మధ్యలో 14 కి.మీ. సొరంగాన్ని నిర్మించాల్సి ఉంది. సొరంగానికి ప్రత్యామ్నాయంగా ఉదండపూర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోయాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
లాభాల్లో ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌గా జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4% వృద్ధితో రూ. 5,229 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 5,023 కోట్లు ఆర్జించింది. ఆదాయం రూ. 19,283 కోట్ల నుంచి రూ. 19,344 కోట్లకు బలపడింది. షేరుకి రూ. 3 చొప్పున రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.17% నుంచి 4.38%కి, నికర ఎన్పీఏలు 1.72% నుంచి 1.27%కి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం క్షీణించి రూ. 117 వద్ద ముగిసింది. -
ఆర్ఈసీలో వాటా విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకా రం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు మొత్తం 52.63% వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా భావించినప్పటికీ... విద్యుత్ శాఖ జోక్యంతో ప్రతిపాదన మారింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేంద్రానికి ఆర్ఈసీలో 57.99 శాతం, పీఎఫ్‌సీలో 65.64 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, ఈటీఎఫ్ ద్వారా కొన్ని వాటాలను విక్రయించడంతో ఆర్ఈసీలో కేంద్రం హోల్డింగ్ 52.63 శాతానికి తగ్గింది. మరోవైపు, 2022 నాటికి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను రెట్టింపు స్థాయిలో 60 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంలో భాగంగా కొత్త వ్యవసాయ ఎగుమతి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడానికి, అంతర్జాతీయ అగ్రి–ట్రేడ్‌లో మరింత వాటా దక్కించుకునేందుకు ఇది దోహదపడగలదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఉత్పత్తులకు ప్రమాణాలు నెలకొల్పడం, నిబంధనలను క్రమబద్ధీకరించడం, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు ఈ విధానం కింద ప్రాధాన్యం లభించనున్నట్లు ఆయన వివరించారు. -
కాళేశ్వరానికి రూ.12,061 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఆర్థిక సహకారం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ముందుకు వచ్చింది. ఎలక్ట్రో మెకానికల్ పనులకు అవసరమైన రూ.12,061 కోట్ల నిధులను రుణం రూపంలో ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి మంగళవారం లేఖ రాసినట్లు నీటి పారుదల వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతల పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన ప్రభుత్వం.. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమీకరిస్తున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే కార్పొరేషన్ ద్వారా మూడు విడతల్లో రుణ సమీకరణ చేసింది. ఆంధ్రాబ్యాంకు, విజయ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ద్వారా మొత్తంగా రూ.24,780 కోట్ల రుణాలకు ఒప్పందాలు కుదరగా.. ఇప్పటికే రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే మరిన్ని నిధులు సమీకరించాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పీఎఫ్సీ నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందాల ప్రక్రియ త్వరలోనే జరిగే అవకాశం ఉంది. -
పీఎఫ్సీకి భారీ నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,409 కోట్ల భారీ నికరనష్టాన్ని చవిచూసింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 1,259 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అయితే తాజాగా ముగిసిన త్రైమాసికంలో వడ్డీ ఆదాయం తగ్గడం, మొండిబకాయిలకు కేటాయింపులు పెరగడంతో నష్టాలు వచ్చాయి. సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2016–17 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను సిఫార్సుచేయరాదని నిర్ణయించింది. ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆదాయం రూ. 6,787 కోట్ల నుంచి రూ. 5,797 కోట్లకు తగ్గింది. పరపతి నియంత్రణల ప్రకారం రూ. 35,994 కోట్ల విలువైన స్టాండర్డ్ ఆస్తుల్ని (కంపెనీ ఇచ్చిన రుణాలు) పునర్వ్యవస్థీకరించిన ఆస్తులుగా వర్గీకరించింది. దాంతో ఈ రుణాలపై కేటాయింపులు 0.35 శాతం నుంచి 4.25 శాతానికి పెరిగాయి. దాంతో తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభనష్టాల ఖాతాలో రూ. 1,404 కోట్ల తరుగు ఏర్పడింది. అలాగే రూ. 8,284 కోట్ల మేర రెండు ఎన్పీఏలు ఏర్పడటంతో ఇందుకు సంబంధించి కూడా రూ. 963 కోట్లు కేటాయించాల్సివచ్చింది. రూ. 5,000 కోట్లకు పైబడిన మొండి బాకీల కోసం మరో రూ. 1,083 కోట్లు కేటాయింపులు జరిపినట్లు పీఎఫ్సీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. -
పీఎఫ్సీ... వడ్డీ ఆదాయం జోష్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.1,713 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 నికర లాభం(రూ.1,576 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని పవర్ ఫైనాన్స్ కార్పొ తెలిపింది. అధిక వడీ ఆదాయం కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.7,106 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ1లో రూ.6,709 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.7,072 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
వాటాదారులకు పీఎఫ్సీ 1:1 ‘బోనస్’
న్యూఢిల్లీ: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. వాటాదారుల వద్ద ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు మరో ఒక్క షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిపింది. అంతేకాకుండా అధీకృత షేర్ మూల ధనాన్ని రూ.2,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచుకోవడానికి కూడా బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా విద్యుత్, సంబంధిత రంగాల ప్రాజెక్ట్‌లకు పీఎఫ్సీ నిధులు అందిస్తోంది. బోనస్ వార్తల నేపథ్యంలో పీఎఫ్సీ షేర్ బీఎస్ఈలో 4.6 శాతం లాభంతో రూ.210 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 6.1 శాతం లాభపడి రూ.213ను తాకింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా ఉన్న రిజర్వ్‌లను ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు జారీ చేయడానికి వినియోగించుకోవాలన్న ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎఫ్సీ ఈ బోనస్ షేర్లను అందిస్తోంది. -
పీఎఫ్సీకి అవార్డ్లు
హైదరాబాద్ : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) కంపెనీకి ఐసీసీ పీఎస్ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్లు (2015) రెండు కేటగిరీల్లో లభించాయి. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) అందిస్తున్న ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్లు.. కార్పొరేట్ గవర్నెన్స్, ఆపరేషనల్ పెర్ఫామెన్స్ ఎక్స్‌లెన్స్ కేటగిరీల్లో లభించాయని పీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఒక ఉత్సవంలో ఈ అవార్డ్‌లను పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి టి.ఎన్.ఆర్. రావు నుంచి స్వీకరిస్తున్న పీఎఫ్సీ సీఎండీ, ఎం.కె. గోయల్‌ను చిత్రంలో తిలకించవచ్చు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం మాజీ కార్యదర్శి శ్రీ భాస్కర్ చటర్జీ కూడా ఫొటోలో ఉన్నారు. -
పీఎఫ్సీ వాటా విక్రయం సక్సెస్
ఖజానాకు రూ.1,600 కోట్లు న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ బాగుం డటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) తలపెట్టిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) 2.34 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ సంస్థలో ప్రభుత్వానికి ఉన్న వాటాలో 5 శాతాన్ని... అంటే 6.60 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్కి ఉంచగా 15.41 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఒకో షేరుకు రూ. 254 ధరను నిర్ణయించటంతో ఖజానాకు రూ. 1,600 కోట్ల పైచిలుకు జమ కానున్నాయి. మొత్తం షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 1.32 కోట్ల షేర్లను ప్రతిపాదించగా ఏకంగా 5.92 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు కనీస విక్రయ ధర రూ.254లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంటు లభిస్తుంది. బీఎస్ఈలో సోమవారం పీఎఫ్సీ షేర్లు 2.12 శాతం క్షీణించి రూ. 254.05 వద్ద ముగిశాయి.