4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాలు (పీఎఫ్‌సీఎస్), జిల్లా స్థాయి మత్స్యకారుల సహకార సంఘాలకు (డీఎఫ్‌సీఎస్) ఎన్నికలు నిర్వహించాలని సహకార శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్‌ను అనుమతిస్తూ, విచారణ ముగించింది. గ్రామస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మత్స్యకారుల సహకార సంఘాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో హనుమకొండకు చెందిన డీఎఫ్‌సీఎస్ చీఫ్ ప్రమోటర్ బుస్సా మల్లేశంతో పాటు మరో ఏడుగురు చీఫ్ ప్రమోటర్లు పిటిషన్ దాఖలు చేశారు.
12 జిల్లాల పరిధిలో ఎన్నికలు నిర్వహించారని, మిగిలిన 21 జిల్లాల పరిధిలో కూడా వెంటనే నిర్వహించాలని కోరుతూ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ రాష్ట్ర ఎన్నికల అథారిటీకి సెప్టెంబర్ 23న వినతిపత్రం సమర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అందుకే మరో మార్గంలేక హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. పిటిషనర్లు వినతిపత్రం సమర్పించినా అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదని వారి తరఫున న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపించారు.
ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సెప్టెంబర్ 9న సహకార మంత్రి సమావేశం నిర్వహించి సమస్యను వివరిస్తూ, ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించాలని చెప్పారని పేర్కొన్నారు. అయినా అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సహకార శాఖ అధికారులను ఆదేశిస్తూ, విచారణ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment