సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఆర్థిక సహకారం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) ముందుకు వచ్చింది. ఎలక్ట్రో మెకానికల్ పనులకు అవసరమైన రూ.12,061 కోట్ల నిధులను రుణం రూపంలో ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు పీఎఫ్‌సీ చైర్మన్ రాజీవ్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి మంగళవారం లేఖ రాసినట్లు నీటి పారుదల వర్గాల ద్వారా తెలిసింది.
ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతల పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన ప్రభుత్వం.. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమీకరిస్తున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే కార్పొరేషన్ ద్వారా మూడు విడతల్లో రుణ సమీకరణ చేసింది. ఆంధ్రాబ్యాంకు, విజయ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ద్వారా మొత్తంగా రూ.24,780 కోట్ల రుణాలకు ఒప్పందాలు కుదరగా.. ఇప్పటికే రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే మరిన్ని నిధులు సమీకరించాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పీఎఫ్‌సీ నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందాల ప్రక్రియ త్వరలోనే జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment