వాటాదారులకు పీఎఫ్సీ 1:1 ‘బోనస్’
న్యూఢిల్లీ: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. వాటాదారుల వద్ద ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు మరో ఒక్క షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిపింది. అంతేకాకుండా అధీకృత షేర్ మూల ధనాన్ని రూ.2,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచుకోవడానికి కూడా బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా విద్యుత్, సంబంధిత రంగాల ప్రాజెక్ట్‌లకు పీఎఫ్‌సీ నిధులు అందిస్తోంది. బోనస్ వార్తల నేపథ్యంలో పీఎఫ్‌సీ షేర్ బీఎస్‌ఈలో 4.6 శాతం లాభంతో రూ.210 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 6.1 శాతం లాభపడి రూ.213ను తాకింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా ఉన్న రిజర్వ్‌లను ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు జారీ చేయడానికి వినియోగించుకోవాలన్న ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎఫ్‌సీ ఈ బోనస్ షేర్లను అందిస్తోంది.