
గతవారం బిజినెస్
బ్యాంకులకు రూ.25,000 కోట్ల మూలధనం
బ్యాంకులకు వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టత, పోటీతత్వం మెరుగుదలకు ప్రభుత్వం తగిన పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. దీనితోపాటు ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లో తన వాటాను 50 శాతం దిగువకు తగ్గించుకునే విషయాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది.
కీలక పరిశ్రమ వృద్ధి 2.9 శాతం
ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జనవరిలో 2.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గడచిన మూడు నెలల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ రంగాల వాటా 38 శాతం.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.56,500 కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ఒనగూరేది రూ.36,000 కోట్లు. మిగిలిన రూ.20,500 కోట్లు వ్యూహాత్మక వాటాల (మెజారిటీ వాటాలు) విక్రయం ద్వారా సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. కాగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరును ఇకమీదట ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (డీఐపీఏఎం)గా వ్యవహరించనున్నారు.
బీమాలో ఎఫ్‌డీఐ నిబంధనలు సడలింపు
బీమా, పింఛను రంగాలు, స్టాక్ ఎక్స్చేంజీలు, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దీంతో బీమా, పింఛను రంగాల్లో ఇకపై 49 శాతం దాకా ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. అటు నిర్దిష్ట నిబంధనలకు లోబడి అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో (ఏఆర్‌సీ) ఆటోమేటిక్ పద్ధతిలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు.
‘రీట్స్’ పెట్టుబడులు వస్తున్నాయ్
సింగపూర్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సక్సెస్ అయిన రీట్ల (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) విధానాన్ని మన దేశంలోనూ ఆరంభించాలని జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. రీట్స్ పెట్టుబడులు పొందేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న డివెడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను తొలగిస్తున్నామని, దీర్ఘకాలిక మూలధనంపై పన్ను విధానాన్ని కూడా హేతుబద్దీకరిస్తున్నామని, అలాగే ప్రస్తుతం ఆదాయం పన్ను మినహాయింపుల్లో భాగంగా ఇస్తున్న ఇంటి అద్దె మినహాయింపులను కూడా రూ.24,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో వివరించారు.
ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలకు సీడీసీ ఆసక్తి
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఇంగ్లాండ్‌కి చెందిన సీడీసీ, సింగపూర్‌కి చెందిన జీఐసీ తదితర సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. 15 శాతం వాటాల కొనుగోలు కోసం ప్రపంచ బ్యాంకు గ్రూప్‌లో భాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో కూడా కేంద్రం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఐడీబీఐ బ్యాంకులో దాదాపు 80 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా వీటిని 50 శాతానికన్నా తక్కువకి తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది.
విమాన ప్రయాణం మరింత భారం
జెట్ ఇంధనం (ఏటీఎఫ్)పై ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతం నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. దీంతో విమాన ప్రయాణం మరింత ఖరీదు కానున్నది. సాధారణంగా విమాన సంస్థల ఖర్చుల్లో ఏటీఎఫ్‌దే అధిక వాటా (40 శాతం) ఉంటుంది. సామాన్య జనాలకు విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తామని చెప్పే ప్రభుత్వం దానికి విరుద్ధమైన విధానాలను అవలంబిస్తోందని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.
3వ అత్యంత విలువైన కంపెనీగా ఐటీసీ
ఐటీసీ కంపెనీ తాజాగా మార్కెట్ క్యాప్ ఆధారంగా మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,61,403 కోట్లుగా ఉంది. ఐటీసీ కన్నా ముందు వరుసలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాప్ వరుసగా రూ.4,48,272 కోట్లుగా, రూ.3,18,260 కోట్లుగా ఉంది. ఇక ఐటీసీ తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ (రూ.2,58,291 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.2,48,947 కోట్లు) ఉన్నాయి.
శాంసంగ్.. 2016 విశ్వసనీయమైన బ్రాండ్
దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మొబైల్స్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. టాప్-5లో కేవలం ఒకే ఒక దేశీ సంస్థ టాటా గ్రూప్ చోటు దక్కించుకుంది. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్-ఇండియా స్టడీ 2016’ పేరుతో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్‌ఏ) ఒక సర్వే నిర్వహించింది. విశ్వసనీయమైన టాప్-5 బ్రాండ్స్‌లో శాంసంగ్ మొబైల్స్, సోనీ, ఎల్‌జీ, నోకియా, టాటా కంపెనీలు ఉన్నాయి. కాగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘అత్యంత విశ్వసనీయమైన ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్’గా అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఉన్నాయి.
ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు
ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఐదుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వారిలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ (3.5 బిలియన్ డాలర్ల సంపద-453వ స్థానం), బెనెట్-కోల్‌మన్ అండ్ కో సంస్థ చైర్‌పర్సన్ ఇందు జైన్ (3.1 బిలియన్ డాలర్ల సంపద-549వ స్థానం), స్మితా కృష్ణ గోద్రేజ్ (2.2 బిలియన్ డాలర్ల సంపద-810వ స్థానం), యూఎస్‌వీ ఫార్మా చైర్‌పర్సన్ లీనా తివారి (1.7 బిలియన్ డాలర్ల సంపద-1,067వ స్థానం), హావెల్స్ ఇండియా వ్యవస్థాపకుడు దివంగత కిమత్ రాయ్ గుప్తా భార్య వినోద్ గుప్తా (1.1 బిలియన్ డాలర్ల సంపద-1,577వ స్థానం) ఉన్నారు.
15 ఏళ్ల పాత కేసుల ఉపసంహరణ
పన్ను వివాదాల సత్వర పరిష్కారం దిశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల క్రితం నుంచీ అపరిష్కృతంగా ఉన్న రూ. 5 లక్షల లోపు సెంట్రల్ ఎకై ్సజ్ ఎగవేత కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేసులను ప్రాసిక్యూషన్ నుంచి ఉపసంహరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తగిన స్థాయి అధికారి హైకోర్డులో పిటిషన్ దాఖలు చేయడానికి వీలు కల్పిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
8 నుంచి మళ్లీ పసిడి బాండ్లు
పసిడి బాండ్ల పథకం మూడవ విడతకు వచ్చే మంగళవారం నాడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... బాండ్లకు దరఖాస్తులను మార్చి 8వ తేదీ నుంచీ 14వ తేదీవరకూ సమీకరిస్తారు. దరఖాస్తులకు అనుగుణంగా బాండ్లు మార్చి 29న జారీ అవుతాయి.
వాహన ధరలకు రెక్కలు
వాహన తయారీ కంపెనీలన్నీ వాటి కార్ల ధరలను వరుసపెట్టి పెంచేస్తున్నాయి. దీనికి బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వడ్డింపే ప్రధాన కారణం. హోండా మోటార్ ఇండియా తాజాగా కార్ల ధరలను రూ.79,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వాహన ధరల్ని రూ.82,906 వరకు, మహీంద్రా ప్యాసెంజర్ వాహన ధరల్ని రూ.47,000 వరకు పెంచింది. మారుతీ సుజుకీ కూడా కార్ల ధరలను రూ.1,441-రూ.34,494 శ్రేణిలో పెంచింది. ఇక మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు కూడా మార్చి 15 నుంచి రూ.5 లక్షల వ రకు పెరగనున్నాయి. అలాగే టాటా మోటార్స్ కంపెనీ ప్యాసెంజర్ వాహన ధరలను రూ.2,000-రూ.35,000 శ్రేణిలో పెంచింది.
డీల్స్..
►పిరమాల్ ఎంటర్‌ప్రెజైస్ తాజాగా అమెరికాకు చెందిన అడాప్టివ్ సాఫ్ట్‌వేర్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 24.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు).
►జపాన్ దిగ్గజం సుమిటొమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎంబీసీ) మంగళవారం కొటక్ మహీంద్రా బ్యాంకులో దాదాపు 1.78 శాతం మేర వాటాలను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 2,069 కోట్లు.