గతవారం బిజినెస్
జేపీ ఫ్లాట్ బయ్యర్స్‌కు సుప్రీం అండ!
గృహ కొనుగోలుదారు ప్రయోజనాలే లక్ష్యంగా రియల్టీ దిగ్గజం– జేపీ ఇన్‌ఫ్రాటెక్ దివాలా ప్రక్రియను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమీక్షించటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. జేపీ ఇన్‌ఫ్రా నిర్వహణ నియంత్రణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియమించిన ఇంటిర్మ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు (ఐఆర్‌పీ) అప్పగిస్తూ... తక్షణం ఇది అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.
ధరలు అప్... పరిశ్రమలు డౌన్
2017 జూలై పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 4.5 శాతం. మరోవైపు ఆగస్టు నెల్లో రిటైల్ ధరల స్పీడ్ 3.36 శాతంగా నమోదయింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక రిటైల్ ధరల తరహాలోనే టోకు ధరలు కూడా ఆగస్టులో తీవ్ర స్థాయికి పెరిగాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.24 శాతం పెరిగింది.
ఎగుమతులు బాగున్నా... భారంగా లోటు
భారత్ ఎగుమతుల వృద్ధి ఆగస్టులో 10.29 శాతంగా నమోదయ్యింది. ఈ స్థాయి వృద్ధి రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ఆగస్టులో ఎగుమతుల విలువ 23.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఆగస్టు నెలలో దిగుమతులూ భారీగా పెరిగాయి. ఈ విలువ 21.02 శాతం పెరుగుదలతో 35.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11.65 బిలియన్ డాలర్లకు చేరింది.
ప్రత్యేక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్
బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన మొబైల్ టవర్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా ప్రస్తుతం 4,42,000 మొబైల్ టవర్స్ ఉండగా, వీటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందినవి 66,000 పైచిలుకు ఉన్నాయి. టవర్స్ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని టెల్కోలకు అద్దెకివ్వడం ద్వారా కొత్త కంపెనీ మరింత ఆదాయం ఆర్జించగలిగే అవకాశం ఉంటుంది.
ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా టాటా సన్స్!
టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలకు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా సంస్థ కార్పొరేట్ స్వరూపాన్ని మార్చేసేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చే దిశగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌కు తగు మార్పులు చేర్పులు చేసే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది. పేరును కూడా టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మార్చే ప్రతిపాదన ఇందులో ఉంది. కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు టాటా సన్స్ వర్గాలు తెలిపినా, దీనిని మిస్త్రీ వ్యతిరేకించారు.
విదేశీ మారక నిల్వలు.. రికార్డ్
దేశీయ విదేశీ మారకద్రవ్య(ఫారెక్స్) నిల్వలు కొత్త రికార్డులకు దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 8వ తేదీతో ముగిసిన వారంలో 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఆటో...
మహీంద్రా నుంచి జీతో మినీ వ్యాన్
మహీంద్రా అండ్ మహీంద్రా హైదరాబాద్ మార్కెట్లో జీతో మినీ వ్యాన్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్–4 ప్రమాణాలతో 625 సీసీ సింగిల్ సిలిండర్, వాటర్ కూల్డ్ ఎం–డ్యూరా ఇంజన్‌ను పొందుపరిచారు. 16 హెచ్‌పీ ఇంజన్ ఔట్‌పుట్, 38 ఎన్‌ఎం టార్క్, 1,190 కిలోల బరువు, అయిదు గేర్లు, మాన్యువల్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. డ్రైవర్‌తో సహా అయిదుగురు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు. 3 రంగుల్లో లభిస్తోంది.
మార్కెట్‌లోకి టాటా ‘టియాగో విజ్’
‘టాటా మోటార్స్’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ ‘టియాగో’లో లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ ‘విజ్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4.52 లక్షలు– రూ.5.3 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త వెర్షన్‌లో 9 రకాల కొత్త ఫీచర్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
నియామకాలు
ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌లో సురేశ్
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) వైస్ చైర్మన్‌గా శ్రీనివాసా ఫామ్స్ ఎండీ సురేశ్ చిట్టూరి నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ నుంచి ఈ పదవి పొందిన రెండో వ్యక్తిగా రికార్డు స్థాపించారు. ఐఈసీ బోర్డులో తొలిసారిగా దేశం నుంచి వెంకటేశ్వర హ్యాచరీస్ వ్యవస్థాపకులు బి.వి.రావు 1992–93లో స్థానం సంపాదించారు.
యూఐఐ సీఎండీగా ఎంఎన్ శర్మ
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ (యూఐఐ) కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంఎన్ శర్మ నియమితులయ్యారు. తక్షణం ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ఈ మేరకు వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఇంతక్రితం ఆయన హెల్ ఇన్సూరెన్స్ టీపీఏ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పనిచేశారు.
విలీనం దిశగా ఇండస్‌ఇండ్–బీఏఎఫ్‌ఎల్
ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో సూక్ష్మరుణాల సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (ఒకనాటి ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. విలీన సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు ఇరు సంస్థలూ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిర్ధిష్ట కాలవ్యవధిలో మదింపు ప్రక్రియ పూర్తిచేసేందుకు, విలీన అవకాశాలను పరిశీలించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇరు సంస్థలు తెలియజేశాయి. అయితే, ఒప్పంద గడువు ఎప్పటిదాకా ఉంటుందనేది వెల్లడించలేదు.
సైయంట్ చేతికి బీఅండ్‌ఎఫ్ డిజైన్
ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ తాజాగా అమెరికాకు చెందిన బీఅండ్‌ఎఫ్ డిజైన్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు 5.5 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. తమ అనుబంధ సంస్థ సైయంట్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా పూర్తి వాటా కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం.