న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతమవుతుందని రుణాలిచ్చిన సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ‘సంస్థ విలువను సముచితంగా, పారదర్శకంగా మదింపు చేసేలా బిడ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని రుణదాతలు ఆశావహంగా ఉన్నారు’ అని బ్యాంకర్ల కన్సార్షియం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో కుంగుతున్న జెట్‌కు ఊపిరినిచ్చేలా అత్యవసరంగా రూ. 400 కోట్లు సమకూర్చడానికి బ్యాంకులు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. జెట్ యాజమాన్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న 26 బ్యాంకుల కన్సార్షియం.. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్లను పిలిచింది. ఎతిహాద్ ఎయిర్‌వేస్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎన్‌ఐఐఎఫ్, ఇండిగో పార్ట్‌నర్స్ సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఇవి మే 10 లోగా తుది బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
భారీగా పతనమైన జెట్ షేరు...
కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో గురువారం జెట్ ఎయిర్‌వేస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 32 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈలో 32.23 శాతం క్షీణతతో రూ. 163.90 వద్ద జెట్ షేరు క్లోజయ్యింది. ఒక దశలో 34.62 శాతం దాకా తగ్గి రూ. 158.10 (52 వారాల కనిష్టం) స్థాయికి కూడా పడిపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో జెట్ షేర్లు 31 శాతం క్షీణించి రూ. 165.75 వద్ద క్లోజయ్యాయి. బీఎస్‌ఈలో 60.41 లక్షలు, ఎన్‌ఎస్?లో 5 కోట్ల షేర్లు చేతులు మారాయి. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,111 కోట్ల మేర క్షీణించి రూ. 1,862 కోట్లకు పడిపోయింది.
5 విమానాలు లీజుకు తీసుకుంటాం: ఎయిరిండియా
జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన అయిదు విమానాలను లీజుకు తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు ప్రభుత్వ రంగ ఎయిరిండియా సీఎండీ అశ్వని లొహానీ లేఖ రాశారు. జెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించే ఉద్దేశంతో.. వీటిని లండన్, దుబాయ్, సింగపూర్ రూట్లలో నడపాలని భావిస్తున్నట్లు ఏప్రిల్ 17న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బోయింగ్ 777 రకానికి చెందిన అయిదు విమానాలను పరస్పరం ఆమోదయోగ్యమైన షరతులు బట్టి లీజుకు తీసుకోవాలని భావిస్తున్నట్లు లొహానీ తెలిపారు. విమాన సర్వీసుల రద్దుతో విదేశాల్లో నిల్చిపోయిన జెట్ ఎయిర్‌వేస్ ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ చార్జీలు కాకుండా ప్రత్యేక చార్జీలను వర్తింప చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
ఇతర సంస్థలకు జెట్ స్లాట్స్..
జెట్ విమానాల రద్దు కారణంగా ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో నిరుపయోగంగా మారిన 440 స్లాట్స్‌ను తాత్కాలికంగా ఇతర ఎయిర్‌లైన్స్‌కు కేటాయించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆయా విమానాశ్రయాల అధికారులతో కూడిన కమిటీ కేటాయింపులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ వ్యవధి మూడు నెలల పాటు ఉంటుందన్నారు. ముంబైలో 280 స్లాట్స్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 160 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని వివరించారు. వచ్చే మూడు నెలల్లో ఇతర ఎయిర్‌లైన్స్ మరో 30 విమానాలను సమకూర్చుకుంటున్నాయని ఖరోలా చెప్పారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: ఉద్యోగ యూనియన్ల విజ్ఞప్తి
కింగ్‌ఫిషర్ తరహాలో జెట్ ఎయిర్‌వేస్ కూడా మూతబడకుండా చూసేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని జెట్ అధికారులు, ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. కంపెనీలో చోటు చేసుకున్న పరిణామాల వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని జెట్ ఎయిర్‌వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్‌సీపీ పార్టీ శాసనసభ్యుడు కిరణ్ పవాస్కర్ డిమాండ్ చేశారు. 16,000 మంది పర్మనెంట్ ఉద్యోగులపై ప్రభావం పడుతోందని, సర్వీసులను రద్దు చేసే ముందుగా వారి జీతాల బకాయిలను ఎందుకు చెల్లించలేదో కంపెనీ వివరణ ఇవ్వాలన్నారు.
జెట్‌కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్!
Published Fri, Apr 19 2019 4:58 AM | Last Updated on Fri, Apr 19 2019 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment