ఎల్‌ఐసీ హౌసింగ్ లాభం 17 శాతం అప్
ముంబై: మార్టిగేజ్ రుణాల సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 370 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 317 కోట్లతో పోలిస్తే ఇది 17% వృద్ధి. ఇదే కాలానికి ఆదాయం కూడా 19% పెరిగి రూ. 2,478 కోట్లకు చేరింది. గతంలో రూ. 2,075 కోట్ల ఆదాయం నమోదైంది.వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 4.50 డివిడెండ్‌ను చెల్లించనుంది.
ఇక పూర్తి ఏడాది(2013-14)కి కంపెనీ నికర లాభం 29% ఎగసి రూ. 1,317 కోట్లను తాకగా, మొత్తం ఆదాయం సైతం 22% పుంజుకుని రూ. 9,335 కోట్లయ్యింది. ఈ కాలంలో నికర మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 0.36% నుంచి 0.39%కు పెరిగాయి. కాగా, క్యూ4లో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16% వృద్ధితో రూ. 533 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్లు 2.16% నుంచి 2.4%కు బలపడినట్లు కంపెనీ ఎండీ సునీతా శర్మ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 1.4% లాభపడి రూ. 273 వద్ద ముగిసింది.