LIC Housing Finance
-
తగ్గిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభం
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ డిసెంబర్ త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పడిపోయి రూ.480 కోట్లకు వచ్చి చేరింది. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల ఉన్నప్పటికీ ఆశించిన క్రెడిట్ నష్టానికి అదనపు కేటాయింపులు చేయడం ఈ తగ్గుదలకు కారణమని కంపెనీ ప్రకటించింది. రాని బాకీల కోసం చేసిన అదనపు కేటాయింపులు డిసెంబర్ త్రైమాసికంలో రూ.7,285 కోట్లుగా ఉన్నాయి. 2021 అక్టోబర్–డిసెంబర్లో ఇది రూ.5,716 కోట్లు. స్థూల నిరర్ధక ఆస్తులు 5.04 నుంచి 4.75 శాతానికి వచ్చి చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు 3.2 నుంచి 2.4 శాతంగా ఉన్నాయి. ఆదాయం 16 శాతం దూసుకెళ్లి రూ.5,871 కోట్లు, నికర వడ్డీ ఆదాయం 10 శాతం ఎగసి రూ.1,606 కోట్లుగా ఉంది. జారీ చేసిన రుణాలు రూ.17,770 కోట్ల నుంచి రూ.16,100 కోట్లకు వచ్చి చేరాయి. -
కారణం తెలియదు, ఫర్వాలేదనిపించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్!
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి ఫలితాల పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.305 కోట్లుగా నమోదైంది. కానీ, కీలకమైన వడ్డీ ఆదా యం స్వల్పంగా తగ్గి (0.80 శాతం) రూ.1,163 కోట్లకు పరిమితమైంది. ఇందుకు కారణం ఏంటన్నది సంస్థ వెల్లడించలేదు. వ్యక్తిగత విభాగంలో రుణాల మంజూరు స్వల్పంగా తగ్గి రూ.14,300 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల వితరణ 4 శాతం పెరిగి రూ.16,110 కోట్లుగా ఉంది. సంస్థ నిర్వహణలోని మొత్తం రుణాల్లో వ్యక్తులకు ఇచ్చినవి రూ.2,16,771 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 2 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమైంది. కేటాయింపులు రూ.6,552 కోట్లకు పెరిగాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ఎల్ఐసీ, బజాజ్ హౌసింగ్ సంస్థల రుణ రేట్లు పెంపు
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు తమ గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) వరకూ పెంచాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే, అరశాతం వడ్డీ పెంపుతో వేతనం, వృత్తి పరమైన వ్యక్తులకు గృహ రుణ రేటు 7.70 శాతంగా ఉండనుంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైమ్ లెండింగ్ 7.50 శాతం నుంచి 8 శాతానికి చేరింది. -
రూ. 2 కోట్ల గృహ రుణానికీ 6.66% వడ్డీ
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) ఇకపై రూ.2 కోట్ల వరకూ గృహ రుణంపై కూడా అతి తక్కువ వడ్డీరేటు 6.66 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకూ రూ.50 లక్షల రుణం వరకూ ఉన్న ఈ అతితక్కువ వడ్డీరేటు ఆఫర్‌ను రూ.2 కోట్ల వరకూ రుణానికి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కొత్త రుణ గ్రహీతలకు రూ.50 లక్షల వరకూ 6.66 శాతం వద్ద అతితక్కువ రుణ రేటు నిర్ణయాన్ని ఈ యేడాది జూలైలో సంస్థ ప్రకటించింది. అయితే 6.66 శాతం వడ్డీరేటు కోరుకునే వారికి సిబిల్ స్కోర్ 700, ఆపైన ఉండాలి. 2021 సెపె్టంబర్ 22 నుంచి నవంబర్ 30 మధ్య రుణ మంజూరు జరిగి, మొదటి దఫా రుణ పంపిణీ 2021 డిసెంబర్‌లోపు జరిగి ఉండాలి. వేతనం పొందుతున్న వారితోపాటు స్వయం సంపాదనా పరులకూ తాజా నిర్ణయం వర్తిస్తుందని సంస్థ ఎండీ, సీఈఓ వై విశ్వనాథ్ గౌడ్ తెలిపారు. రూ.2 కోట్ల వరకూ రుణం తీసుకున్న సందర్భంలో రుణ మొత్తంపై 0.25% లేదా గరిష్టంగా రూ.10,000కానీ ఏది తక్కువైతే అంతమొత్తం ప్రాసెసింగ్ ఫీజు రాయితీ లభిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. గృహ రుణానికి ఆన్లైన్ దరఖాస్తు, ఆమోదానికి ఉద్దేశించి ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ ఇటీవలే ‘హోమై యాప్’ను ఆవిష్కరించింది. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా... పండుగ సీజన్ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) , పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), హెచ్డీఎఫ్సీ గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!
మీరు కొత్త ఇల్లు కొనుగోలుచేయాలని చూస్తున్నారా?, అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) పండుగ సీజన్ ఆఫర్లలో భాగంగా గృహ రుణాలను అతి తక్కువకు(6.66%) అందించనున్నట్లు నేడు ప్రకటించింది. వినియోగదారులు ₹2 కోట్ల వరకు తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలను పొందవచ్చు అని తెలిపింది. నేడు ప్రకటించిన ఈ కొత్త ఆఫర్ సిబిల్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తుంది. వారి వృత్తితో సంబంధం లేకుండా (అంటే వేతన లేదా వృత్తిపరమైన/స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు) రుణాలు మంజూరు చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30, 2021 వరకు మంజూరు చేసిన రుణాల మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. గతంలో ఈ ఆఫర్ రూ.50 లక్షల వరకు గృహరుణాలు తీసుకునే వారికి వర్తించేది అని సీఈఓ వై. విశ్వనాథ గౌద్ తెలిపారు. కానీ, ప్రస్తుతం ₹2కోట్ల వరకు రుణాలకు అదే రేటును పొడిగించినట్లు ఆయన తెలిపారు. రుణగ్రహీతలు HomY App ద్వారా గృహ రుణాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. గృహ రుణాలపై ఇప్పటివరకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది. మీ సిబిల్ స్కోరు గనుక తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంది.(చదవండి: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు..) -
కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉందా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులకు తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు అందిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలనే వారి కోసం వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించింది. గృహ రుణాలపై ఇప్పటివరకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది.(చదవండి: మీ క్రెడిట్ స్కోరు వేగంగా ఎలా పెంచుకోవాలి..?) రుణ పరిమితి ఎంత? ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం.. సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు రూ.50 లక్షల రుణంపై వడ్డీ రేటు 6.90 శాతంతో ప్రారంభమవుతుంది. 700 కంటే ఎక్కువ స్కోరు ఉన్న వినియోగదారులకు రూ.80 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ రేటు పడనుంది. మీ సిబిల్ స్కోరు అనేది ఒక వ్యక్తి ఇంతకు ముందు రుణం తీసుకున్నాడా? ఒకవేళ రుణం తీసుకున్నట్లయితే సకాలంలో చెల్లించాడా అనే దానిపై స్కోరు ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్లను రుణదాతలు చెక్ చేసేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. -
చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?
డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్)తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) తన 4.5 కోట్ల మంది ఖాతాదారులకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందించనున్నట్లు ప్రకటించింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు అందించే గృహ రుణాలపై వడ్డీ రేటు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది అని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్, ఐపీపీబీ పేర్కొన్నాయి. (చదవండి: దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్) దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలు, 136,000కు పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్లతో విస్తృతమైన నెట్ వర్క్ కలిగి ఉన్నట్లు ఐపీపీబీ తెలిపింది. ఐపీపీబీ, ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ గృహ రుణాలు పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటాయి. అవగాహనపూర్వక ఒప్పందం(ఎమ్ఒయు)లో భాగంగా.. అన్ని గృహ రుణాల కోసం క్రెడిట్ అండర్ రైటింగ్, ప్రాసెసింగ్ బాధ్యతలు చేపట్టే ఐపీపీబీ చేత ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్వహిస్తుంది. ఐపీపీబీ తన ఆన్ గ్రౌండ్ వర్క్ ఫోర్స్ 200,000 పోస్టల్ ఉద్యోగులు(పోస్ట్ మెన్, గ్రామీణ్ డక్ సేవకులు) ద్వారా మైక్రో ఎటిఎమ్, బయోమెట్రిక్ సేవాలు, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ అందిస్తుంది. ఈ విస్తృతమైన నెట్ వర్క్ ద్వారా విభిన్న ప్రజలకు ఎల్ఐసీ హౌసింగ్ రుణాలను చేరడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ఐపీపీబీ తెలిపింది. -
కొంపముంచే రుణాలు, తగ్గిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలు
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలకు నిరర్థక రుణాలు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) గండికొట్టాయి. జూన్‌తో అంతమైన మొదటి త్రైమాసికంలో లాభం గణనీయంగా తగ్గిపోయి రూ.153 కోట్లకు పరిమితమైంది. ఎన్పీఏలకు రూ.830 కోట్లను పక్కన పెట్టడం ఇందుకు దారితీసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.817 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 4.5 శాతం పెరిగి రూ.1,275 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.32 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ.8,652 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో రూ.7,650 కోట్లు గృహ రుణాలే ఉన్నాయి. రుణాల మంజూరులో 152 శాతం పురోగతి చూపించింది. ‘‘ఎన్పీఏలకు చేసిన కేటాయింపుల వల్లే మా నికర లాభం తగ్గిపోయింది. దీనికితోడు వేతన వ్యయాలు కూడా ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిని దాటి వచ్చామన్న బలమైన నమ్మకంతో ఉన్నాం. రానున్న కాలంలో మంచి వృద్ధి పథంలో కొనసాగుతాం’’ అని సంస్థ ఎండీ, సీఈవో వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. మూడోదశలోని వసూలు కాని రుణాలు మొత్తం రుణాలో 5.93 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.83 శాతంగానే ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడడం వల్ల వసూళ్లు మందగించాయని.. వసూళ్లపై మరింత దృష్టి సారిస్తామని విశ్వనాథగౌడ్ చెప్పారు. -
బీమా క్లెయిం తిరస్కరించడంతో ఎల్ఐసికి రూ.15.5 లక్షల జరిమానా
హైదరాబాద్: కె.రాములు అనే వృద్దుడు తన మైనర్ మనవరాళ్ల తరఫున బీమా క్లెయిం తిరస్కరణకు సంబందించి ఎల్ఐసి వ్యతిరేకంగా గతంలో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వినియోగదారుల ఫోరం జూలై 25న వెల్లడించింది. క్లెయింను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనలను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి రూ.15.5 లక్షలు చెల్లించాలని ఎల్ఐసిని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదివారం ఆదేశించింది. తన కుమారుడు జీవన్ ఆనంద్ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని 2012లో తీసుకున్నట్లు పిర్యాదులో కె.రాములు పేర్కొన్నాడు. అయితే, తన కుమారుడి మరణం తర్వాత మైనర్ మనవరాళ్ల తరఫున వారి తాత రాములు జూలై 6, 2012న ఎల్ఐసికి బీమా క్లెయింను సమర్పించారు. 'మృతుడు తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారాన్ని వెల్లడించకుండా, ప్రస్తుత పాలసీని తీసుకునేటప్పుడు తన మునుపటి పాలసీల గురుంచి తెలపడంలో విఫలమయ్యాడు' అనే కారణంతో బీమా క్లెయింను తిరస్కరించింది. పిర్యాదులో పేర్కొన్న ప్రకారం మరణించిన వ్యక్తి తన పాలసీలో కేవలం ఒక విషయం గురుంచి మాత్రమే ప్రకటించలేదని బెంచ్ తెలిపింది. జూన్ 13, 2012 నాటి డిశ్చార్జ్ సారాంశం ప్రకారం, బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27, 2011న తీసుకున్నట్లు ధర్మాసనం గుర్తించింది. "ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేసినట్లు రికార్డులో ఏమీ లేదు" అని బెంచ్ తెలిపింది. జిల్లా వినియోగదారుల ఫోరం 9% వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని ఎల్ఐసిని ఆదేశించింది. అలాగే పరిహారంతో పాటు ఫిర్యాదుదారుడికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని పేర్కొంది. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూలై 2న ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ కింద గృహ రుణ వడ్డీ రేట్లను 6.66 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఆగస్టు 31, 2021 లోపు రుణాలు కోసం దరఖాస్తు చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని ఎల్ఐసీ తెలిపింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే, రుణగ్రహీతల సీబీల్ స్కోర్ కచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొంది. సీబీల్ స్కోర్ మంచిగా ఉన్న వారికి 6.66 శాతం నుంచి వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గరిష్టంగా 30 సంవత్సరాల గడువు వరకు గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రుణగ్రహీతలు గృహ రుణాల కోసం ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కి చెందిన HomY app ద్వారా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొంది. అలాగే, ఆన్లైన్ ద్వారానే రుణ దరఖాస్తులను ట్రాక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ HomY app ద్వారా తమ వినియోగదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందిస్తుందని తెలిపింది. మిగతా వివరాల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(https://www.lichousing.com) పోర్టల్ సందర్శించవచ్చు. LIC Housing Finance Ltd slashes Home loan rates to all time low of 6.66%. It's the right time to grab this offer and make your dream home come true...#LICHFL #homeloans #HousingForAll #deal #Offers #HomY — LIC Housing Finance Limited (@LIC_HFL) July 2, 2021 చదవండి: డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్ -
ఆల్కార్గో- ఎల్ఐసీ హౌసింగ్.. యమస్పీడ్
వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి ఖంగుతిన్నాయి. తొలుత 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ ప్రస్తుతం నష్టాలతో కదులుతోంది. 70 పాయింట్లు క్షీణించి 38,729కు చేరింది. నిఫ్టీ సైతం 18 పాయింట్లు తక్కువగా 11,448 వద్ద ట్రేడవుతోంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీని డీలిస్ట్ చేయనున్న వార్తలతో ప్రయివేట్ రంగ కంపెనీ ఆల్కార్గో లాజిస్టిక్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ కంపెనీ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆల్కార్గో లాజిస్టిక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి షేర్లను డీలిస్ట్ చేసేందుకు ప్రమోటర్ గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు ఆల్కార్గో లాజిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. ప్రమోటర్ శశి కిరణ్ శెట్టితోపాటు.. టాలెంటోస్ ఎంటర్టైన్మెంట్ ఇందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు పేర్కొంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి కంపెనీని స్వచ్చందంగా డీలిస్ట్ చేసేందుకు వీలుగా ప్రమోటర్లు పబ్లిక్ వాటాదారుల నుంచి ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్‌నకు 70 శాతంపైగా వాటా ఉంది. దీంతో ఈ కౌంటర్లో కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువయ్యారు. వెరసి ఎన్ఎస్ఈలో ఆల్కార్గో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22 ఎగసి రూ. 131 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎల్ఐసీ హౌసింగ్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 817 కోట్లను తాకింది. ప్రొవిజన్లు రూ. 253 కోట్ల నుంచి రూ. 56 కోట్లకు తగ్గడం ఇందుకు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్లు 2.41 శాతం నుంచి 2.32 శాతానికి స్వల్పంగా నీరసించాయి. మొత్తం ఆదాయం రూ. 4807 కోట్ల నుంచి రూ. 4977 కోట్లకు బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 309ను తాకింది. ప్రస్తుతం 8.3 శాతం లాభంతో రూ. 300 వద్ద ట్రేడవుతోంది. -
ఎల్ఐసీ హౌసింగ్ రుణ రేటు 6.90%
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గృహ రుణాలపై వడ్డీ రేటును కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి 6.90 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది. 700 అంతకుమించి సిబిల్ స్కోరు ఉన్న వారికి రూ.50 లక్షల వరకు గృహ రుణంపై ఈ రేటును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఒకవేళ రూ.50 లక్షలకు మించి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటు 7%గా వసూలు చేయనుంది. కంపెనీ రుణాల్లో 25% మారటోరియంలో ఉన్నట్టు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. రూ.13,000 కోట్ల నిర్మాణ రంగ రుణాల్లో రూ.8,500–9,000 కోట్లు మారటోరియం పరిధిలో ఉన్నట్టు చెప్పారు. పెన్షనర్లకు గృహరుణ పథకం పెన్షనర్లకు ప్రత్యేక పథకాన్ని ‘గృహ వరిష్ట’ పేరుతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆవిష్కరించింది. దీని కింద గృహ రుణాన్ని 80 ఏళ్ల వయసు వరకు కాల వ్యవధిపై లేదా 30 ఏళ్లు ఏది తక్కువ అయితే ఆ కాలానికి రుణాన్ని అందిస్తుంది. రిటైర్మెంట్ తీసుకున్న లేదా ప్రస్తుతం సర్వీసులో ఉండి భవిష్యత్తులో కచ్చితమైన పెన్షన్ సదుపాయం కలిగిన కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థ ల ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద అధిక రుణం కావాలంటే ఆర్జనా శక్తి కలిగిన తమ పిల్లలతో కలసి పెన్షన్ దారులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ‘2020 హోమ్‌లోన్’ ఆఫర్
ముంబై: ఎల్ఐసీ అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘2020 హోమ్‌లోన్ ఆఫర్’ను బుధవారం ఆవిష్కరించనుంది. దీని కింద గృహ రుణాలపై పలు ఆఫర్లను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ‘నివాసం ఉన్నప్పుడే చెల్లించండి’ అనే పథకం కింద.. తీసుకున్న రుణానికి అసలును (ప్రిన్సిపల్) ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా రుణం జారీ చేసిన 48 నెలల తర్వాత (ఈ రెండింటిలో ఏది ముందయితే అది అమలవుతుంది) నుంచి చెల్లించే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది. ఈ కాలంలో రుణంపై వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలో వడ్డీతోపాటు, అసలు కూడా కొంత మొత్తం కలసి ఉంటుంది. ఇక నివాసానికి సిద్ధంగా ఉన్న ఇంటికి రుణం తీసుకుంటే రుణకాల వ్యవధిలో 6 ఈఎంఐలను సంస్థ రద్దు చేస్తుంది. 5వ ఏట, 10వ ఏట, 15వ ఏట ముగిసిన వెంటనే రెండేసి ఈఎంఐలను మాఫీ చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం క్రమం తప్పకుండా రుణానికి ఈఎంఐలను చెల్లిస్తూ ఉండాలి. అలాగే, రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలోపు ఆ రుణాన్ని పూర్తిగా చెల్లించేయకూడదు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటుందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. -
గృహ రుణంలోనూ కలసికట్టుగా...
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనేకానీ నగరాల్లో జీవనశైలికి అనుగుణంగా బతుకుబండి నడిచే పరిస్థితులు లేవు. అలాంటిది... ఇల్లు సమకూర్చుకోవడం ఎంత పెద్ద ప్రహసనమో చెప్పనక్కర్లేదు!! అయితే, గృహ రుణం ఒక్కరి పేరుతో తీసుకునేకంటే దంపతులు కలసి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అధిక మొత్తంలో రుణం సమకూరడమేకాదు, పన్ను ప్రయోజనాలు... తక్కువ నెలవారీ వాయిదా(ఈఎంఐ) వంటి లాభాలెన్నో జాయింట్ హోమ్‌లోన్‌తో పొందొచ్చు. కొత్తింటి ప్రణాళికల్లో ఉన్నవారికి ఉమ్మడి గృహ రుణంపై అవగాహన కల్పించే కథనమిది... శ్రీనివాస కుమార్ (40) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన శ్రీమతి సుమలత (37) కూడా ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు 2013లో జాయింట్ హోమ్ లోన్ (ఉమ్మడిగా గృహ రుణం)ను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు. ఇలా కలసి తీసుకోవడానికి కారణం జాయింట్ లోన్‌పై వడ్డీ రేటు తక్కువగా ఆఫర్ చేయడమే. రూ.44 లక్షల రుణం తీసుకున్నారు. వడ్డీ రేటు నాడు 9.5 శాతంగా ఉంటే, శ్రీనివాస కుమార్ దంపతులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసింది. పైగా ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవడం వల్ల రుణ అర్హత అధికంగా ఉంటుంది. రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, అర్హత మెరుగ్గా ఉండడమే తాము జాయింట్లోన్ తీసుకోవడానికి కారణాలుగా శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. జాయింట్ లోన్ ద్వారా మంచి ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు వీలు పడుతుంది. బడ్జెట్ ఎక్కువైనా కానీ, ఇద్దరు పేరిట రుణం తీసుకుంటున్నారు కనుక అధిక అర్హతలతో బ్యాంకు కూడా ఎక్కువే ఆఫర్ చేస్తుంది. దంపతులు ఇద్దరూ ఉద్యోగులైనా లేదా ఆర్జనా పరులైతే, కలసి ఉమ్మడి రుణం తీసుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుందని ఆర్థిక నిపుణుల విశ్లేషణ. మీరు నవ దంపతులు అయి ఉండి, ఇద్దరూ ఆర్జనా పరులైతే కలసి గృహ రుణం తీసుకునే ఆలోచన తప్పకుండా చేయవచ్చు. ‘‘రియల్ ఎస్టేట్ కొనుగోలు అధిక వ్యయంతో కూడుకుని ఉంటుంది. దీంతో సొంతింటి కల అన్నది ఒక్కరే ఆర్జనా పరులున్న కుటుంబానికి అంత సులభం కాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో జీవిత భాగస్వామి సహ రుణ గ్రహీతగా చేరడం వల్ల ఇద్దరి ఆర్జనను కలపడం, ఇద్దరి క్రెడిట్ స్కోరుతో మరింత మొత్తం గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే సొంతం చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి పేర్కొన్నారు. కలసి తీసుకోవడం వల్ల ప్రయోజనాలను పరిశీలించినట్టయితే... భారీ మొత్తంలో రుణం ఇద్దరు కలసి ఉమ్మడిగా రుణానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా అర్హత ఎక్కువగా ఉంటుంది. దీంతో భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి చూసి బ్యాంకు పెద్ద మొత్తంలో రుణాన్ని ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే.. అందుకు మీ వంతు డౌన్ పేమెంట్ 20 శాతం (రూ.20లక్షలు) పోను మరో రూ.80 లక్షలను 20 ఏళ్ల కాలానికి రుణంగా తీసుకోవాల్సి ఉంటుందని అనుకుంటే, అప్పుడు 8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.70,000 అవుతుంది. సాధారణంగా రుణగ్రహీత ప్రతీ నెలా నికరంగా అందుకునే వేతనంలో గరిష్టంగా 50 శాతం వరకూ ఈఎంఐ కింద బ్యాంకులు అనుమతిస్తుంటాయి. దీని ప్రకారం రూ.80 లక్షల గృహ రుణం తీసుకోవాలంటే, ప్రతీ నెలా నికరంగా రూ.1.4 లక్షలను అందుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా ఆర్జిస్తున్నట్టు అయితే.. ఇద్దరూ కలసి ఈ మొత్తాన్ని చెల్లించే శక్తి కలిగి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువే చెల్లించే సామర్థ్యం ఉంటే మరింత సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఇంటి కోసం ఇంకా అధిక రుణం తీసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. వేగంగా చెల్లింపులు ఇద్దరు కలసి రుణం తీసుకుంటే, తిరిగి చెల్లించడం సులభం కావడమే కాకుండా, వేగంగా దాన్ని తీర్చేయవచ్చు. వార్షికంగా వచ్చే బోనస్‌లు, పనితీరు ఆధారంగా వచ్చే పారితోషికాన్ని ఇలా గృహ రుణం తీర్చేందుకు వినియోగించినా వాస్తవ కాల వ్యవధి కంటే ముందే గృహ రుణం ముగిసిపోతుంది. ఎందుకంటే చెల్లింపులపై ఎటువంటి నియంత్రణలు ఉండవు. దీనివల్ల వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది. రిజిస్ట్రేషన్ వ్యయం తక్కువ కొన్ని బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే మహిళలకు ఇల్లు/ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తక్కువగా అమల్లో ఉంది. ‘‘ఉమ్మడి గృహ రుణంలో ప్రధాన దరఖాస్తు దారుగా భార్య ఉంటే వ్యయాలను తగ్గించుకోవచ్చు. గృహ రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, రిజిష్ట్రేషన్ చార్జీలో తగ్గింపు ప్రయోజనాలను అందుకోవచ్చు’’ అ ని మైమనీమంత్రా డాట్ కామ్ ఎండీ రాజ్ ఖోస్లా చెప్పారు. క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉమ్మడిగా రుణం తీసుకుంటే దంపతులిద్దరిపై సమానంగా చెల్లింపుల భాధ్య త ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఒకరు ఉద్యోగం కోల్పోతే ఆ మేరకు గృహ రుణ ఈఎంఐ చెల్లింపులో నెలసరి వాటా అందకపోవచ్చు. ఈ కారణంగా ఈఎంఐ చెల్లింపులో వైఫల్యం చెందితే అప్పుడు ఇద్దరి క్రెడిట్ స్కోరుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘‘తిరిగి చెల్లింపుల బాధ్యత దంపతులపై పూర్తిగా ఉంటుంది. ఒక్కరు చెల్లింపుల్లో వైఫల్యం చెందినా ఇద్దరి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది’’ అని ఆదిల్‌శెట్టి తెలిపారు. పన్ను ప్రయోజనాలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవడం వల్ల అధిక పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. దంపతులు ఉమ్మడిగా రూ.7 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద చెరో రూ.1.5 లక్షల చొప్పున రూ.3లక్షలు, సెక్షన్ 24(బి) కింద రూ.4లక్షల వడ్డీపై (చెరో రూ.2లక్షలు) పన్ను ప్రయోజనం లభిస్తుంది. మధ్యాదాయ వర్గాల నుంచి కొంచెం అధిక ఆర్జనా పరులకు ఈ మేరకు పన్ను ఆదా రూపంలో గణనీయంగానే మిగులుతుంది. వీటిని అనుసరిస్తే మేలు.. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధిలో ఇంటి యజమాని మరణిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విల్లు రాసుకోవడం మంచిది. ఇక వైవాహిక జీవితం నూటికి నూరు పాళ్లు కలసి సాగుతుందని నేటి రోజుల్లో చెప్పడం కష్టమే. కనుక ఉమ్మడిగా గృహ రుణానికి వెళ్లే దంపతులు.. ఇంటిలో వాటా, తిరిగి రుణానికి చేయాల్సిన చెల్లింపులు, ఇతర అంశాలపై స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం ఇంకా మంచిది. దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ ఇద్దరూ విడిపోవాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక గృహ రుణం తీసుకునే సమయంలోనే రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం తప్పనిసరిగా చేయాల్సినది. రుణ గ్రహీతకు ఏదైనా జరిగితే, కుటుంబంపై రుణ చెల్లింపుల బాధ్యతలు పడకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గృహ రుణ గ్రహీతల్లో ఒకరు మరణించడం వల్ల మరొకరిపై చెల్లింపుల బాధ్యత పడకుండా ఈ టర్మ్‌ప్లాన్ ఆదుకుంటుంది. విడాకులు, మరణం... దంపతులు ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత జీవితంలో ఇకమీదట కలసి సాగకూడదని విడాకులకు వెళితే పరిస్థితి ఏమిటి..? గృహ రుణాన్ని తిరిగి చెల్లించడం తప్పనిసరి. కాకపోతే ఇందుకు మార్గాన్ని వారే అన్వేషించుకోవాలి. ‘‘బ్యాంకు తన బకాయిలను వసూలు చేసుకునేందుకు చర్యలు చేపడుతుంది. అవసరమైతే న్యాయపరమైన చర్యలనూ చేపట్టవచ్చు. అందుకని భవిష్యత్తులో విడిపోవాల్సి వస్తే గృహ రుణ చెల్లింపుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై దంపతులు ముందుగానే ఓ స్పష్టమైన అంగీకారానికి రావడం మంచిది’’ అని ఆదిల్‌శెట్టి సూచించారు. ఇక దురదృష్టవశాత్తూ ఉమ్మడి గృహ రుణం తీసుకున్న తర్వాత దంపతుల్లో ఒకరు మరణించినట్టయితే అప్పుడు చెల్లింపుల బాధ్యత పూర్తిగా రెండోవారిపై పడుతుంది. -
ఎల్ఐసీ హౌసింగ్ లాభం రూ. 539 కోట్లు
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 2 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.529 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.539 కోట్లకు పెరిగిందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.3,934 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్ 2.97 శాతం నుంచి 2.49 శాతానికి తగ్గిందని తెలిపింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6.80 డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది. డెవలపర్ రుణాలను కూడా కలుపుకుంటే స్థూల మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.78 శాతానికి పెరిగాయని కంపెనీ పేర్కొంది. వ్యక్తిగత రుణాలనే పరిగణనలోకి తీసుకుంటే స్థూల మొండి బకాయిలు 0.42 శాతంగా ఉన్నాయని వివరించింది. ఇక నికర మొండి బకాయిలు 0.14 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయని పేర్కొంది. వ్యక్తిగత రుణాలు రూ.1,39,024 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,56,270 కోట్లకు, అలాగే డెవలపర్ రుణాలు రూ.5,510 కోట్ల నుంచి రూ.8,093 కోట్లకు పెరిగాయని వివరించింది. -
ఎల్ఐసీ ఫలితాలు సూపర్
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రోత్సాహకర ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాల్లో 20 శాతం నికర లాభాలను నమోదుచేసింది. క్యూ2 లో రూ. 495 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 13 శాతం వృద్ధి చెంది రూ. 3490 కోట్లుగా రిపోర్టు చేసింది. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో కంపెనీ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 21 శాతం పెరిగి రూ. 866 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు మాత్రం రూ. 30 కోట్లవద్దే నిలిచాయి. మార్కెట్ సమయంలో ఫలితాలు ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లతో రికార్డు గరిష్టాన్ని నమెదు చేసినా చివర్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది. -
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కూ మొండి బకాయిల సెగ
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.407 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.382 కోట్ల)తో పోల్చితే 7% వృద్ధి సాధించామని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. మొండి బకాయిల అధిక కేటాయింపు, వేతన సవరణ వల్ల నికర లాభంలో స్వల్ప వృద్ధే సాధించామని కంపెనీ ఎండీ, సీఈఓ సునిత శర్మ తెలిపారు. గత క్యూ1లో రూ.2,965 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,380 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. -
ఎల్ఐసీ హౌసింగ్ లాభం 20% అప్
ఒక్కో షేర్‌కు రూ.5.5 డివిడెండ్ న్యూఢిల్లీ: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.1,668 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,396 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.10,829 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,503 కోట్లకు పెరిగిందని తెలిపింది. నిమ్ 27 శాతం అప్ గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌పై రూ.5.5 డివిడెండ్‌ను చెల్లించడానికి కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఈ డివిడెండ్‌ను ఈ ఏడాది ఆగస్టు 20 తర్వాత చెల్లిస్తామని తెలిపింది. ఇక స్టాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.378 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.448 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.2,861 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు ఎగిసిందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం రూ.650 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.822 కోట్లకు చేరిందని తెలిపింది. కేటాయింపులు సీక్వెన్షియల్ ప్రాతిపదికన 9 శాతం, వార్షిక ప్రాతిపదికన 265 శాతం పెరిగి రూ.38 కోట్లకు చేరాయని వివరిం చింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 20% వృద్ధితో రూ.1,668 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం 31% వృద్ధితో రూ.3,090కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ సోమవారం 1% వృద్ధితో రూ.485కు పెరిగింది. -
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభం రూ. 382 కోట్లు
17 శాతం పెరిగిన ఆదాయం ముంబై: ఎల్ఐసీ అనుబంధ సంస్థ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.382 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.322 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించింది. మొత్తం ఆదాయం రూ.2,509 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,946 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. రుణ నాణ్యత ఉత్తమంగా ఉండాలన్న వ్యూహాన్ననుసరించామని, దీంతో మంచి మార్జిన్లు సాధించామని కంపెనీ ఎండీ, సీఈఓ సునిత శర్మ చెప్పారు. నికర వడ్డీ మార్జిన్లు 2.19 శాతం నుంచి 2.41 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 0.49 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎస్సీడీ)ల ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించడం లక్ష్యమని, ఈ తొలి క్వార్టర్లో రూ.7,000 కోట్లు సమీకరించామని వివరించారు. -
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు స్వల్ప లాభాలు
న్యూఢిల్లీ: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 2014-15 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్వల్ప లాభాలను ఆర్జించింది. 2013-14 ఇదే క్వార్టర్‌తో పోల్చితే నికర లాభం స్వల్పంగా 2.2 శాతం పెరిగి, రూ.378 కోట్లుగా నమోదయ్యింది. ఇక ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,478 కోట్ల నుంచి రూ.2,861కి పెరిగింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1,317 కోట్ల నుంచి రూ.1,386కు ఎగసింది. ఆదాయం రూ.9,335 కోట్ల నుంచి రూ.10,799 కోట్లకు చేసింది. నికర వడ్డీ మార్జిన్ 2.40 శాతం నుంచి 2.47 శాతానికి పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.650 కోట్లకు చేరింది. మొత్తం రుణ పంపిణీ 23 శాతం వృద్ధితో రూ.9,938 కోట్లకు ఎగసింది. వ్యక్తిగత రుణ పంపిణీ 24% వృద్ధితో రూ.9,550 కోట్లుగా నమోదయ్యింది. కాగా ఫలితాలు మంచి ఉత్సాహాన్ని ఇచ్చినట్లు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీతా శర్మ పేర్కొన్నారు. ప్రత్యేకించి రుణ పంపిణీలో వృద్ధి, బకాయిల వసూళ్లు సానుకూల పరిణామాలన్నారు. 2015- 16లో కూడా ఇదే విధమైన ప్రోత్సాహకర పరిస్థితి ఉంటుందన్న విశ్వాసాన్ని మేనేజింగ్ డెరైక్టర్ వ్యక్తం చేశారు. -
ఎల్ఐసీ హౌసింగ్ లాభం 17 శాతం అప్
ముంబై: మార్టిగేజ్ రుణాల సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 370 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 317 కోట్లతో పోలిస్తే ఇది 17% వృద్ధి. ఇదే కాలానికి ఆదాయం కూడా 19% పెరిగి రూ. 2,478 కోట్లకు చేరింది. గతంలో రూ. 2,075 కోట్ల ఆదాయం నమోదైంది.వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 4.50 డివిడెండ్‌ను చెల్లించనుంది. ఇక పూర్తి ఏడాది(2013-14)కి కంపెనీ నికర లాభం 29% ఎగసి రూ. 1,317 కోట్లను తాకగా, మొత్తం ఆదాయం సైతం 22% పుంజుకుని రూ. 9,335 కోట్లయ్యింది. ఈ కాలంలో నికర మొండి బకాయిలు(ఎన్పీఏలు) 0.36% నుంచి 0.39%కు పెరిగాయి. కాగా, క్యూ4లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 16% వృద్ధితో రూ. 533 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్లు 2.16% నుంచి 2.4%కు బలపడినట్లు కంపెనీ ఎండీ సునీతా శర్మ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1.4% లాభపడి రూ. 273 వద్ద ముగిసింది.