ముంబై: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ అయిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘2020 హోమ్‌లోన్ ఆఫర్’ను బుధవారం ఆవిష్కరించనుంది. దీని కింద గృహ రుణాలపై పలు ఆఫర్లను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ‘నివాసం ఉన్నప్పుడే చెల్లించండి’ అనే పథకం కింద.. తీసుకున్న రుణానికి అసలును (ప్రిన్సిపల్) ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా రుణం జారీ చేసిన 48 నెలల తర్వాత (ఈ రెండింటిలో ఏది ముందయితే అది అమలవుతుంది) నుంచి చెల్లించే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది.
ఈ కాలంలో రుణంపై వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలో వడ్డీతోపాటు, అసలు కూడా కొంత మొత్తం కలసి ఉంటుంది. ఇక నివాసానికి సిద్ధంగా ఉన్న ఇంటికి రుణం తీసుకుంటే రుణకాల వ్యవధిలో 6 ఈఎంఐలను సంస్థ రద్దు చేస్తుంది. 5వ ఏట, 10వ ఏట, 15వ ఏట ముగిసిన వెంటనే రెండేసి ఈఎంఐలను మాఫీ చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం క్రమం తప్పకుండా రుణానికి ఈఎంఐలను చెల్లిస్తూ ఉండాలి. అలాగే, రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలోపు ఆ రుణాన్ని పూర్తిగా చెల్లించేయకూడదు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటుందని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment