ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో 2 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.529 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.539 కోట్లకు పెరిగిందని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.3,934 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్ 2.97 శాతం నుంచి 2.49 శాతానికి తగ్గిందని తెలిపింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6.80 డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది.
డెవలపర్ రుణాలను కూడా కలుపుకుంటే స్థూల మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.78 శాతానికి పెరిగాయని కంపెనీ పేర్కొంది. వ్యక్తిగత రుణాలనే పరిగణనలోకి తీసుకుంటే స్థూల మొండి బకాయిలు 0.42 శాతంగా ఉన్నాయని వివరించింది. ఇక నికర మొండి బకాయిలు 0.14 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయని పేర్కొంది. వ్యక్తిగత రుణాలు రూ.1,39,024 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,56,270 కోట్లకు, అలాగే డెవలపర్ రుణాలు రూ.5,510 కోట్ల నుంచి రూ.8,093 కోట్లకు పెరిగాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment