ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభం రూ. 382 కోట్లు
17 శాతం పెరిగిన ఆదాయం
ముంబై: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.382 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.322 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించింది. మొత్తం ఆదాయం రూ.2,509 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,946 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. రుణ నాణ్యత ఉత్తమంగా ఉండాలన్న వ్యూహాన్ననుసరించామని, దీంతో మంచి మార్జిన్లు సాధించామని కంపెనీ ఎండీ, సీఈఓ సునిత శర్మ చెప్పారు. నికర వడ్డీ మార్జిన్లు 2.19 శాతం నుంచి 2.41 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 0.49 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎస్‌సీడీ)ల ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించడం లక్ష్యమని, ఈ తొలి క్వార్టర్‌లో రూ.7,000 కోట్లు సమీకరించామని వివరించారు.