ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు స్వల్ప లాభాలు
న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 2014-15 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్వల్ప లాభాలను ఆర్జించింది. 2013-14 ఇదే క్వార్టర్‌తో పోల్చితే నికర లాభం స్వల్పంగా 2.2 శాతం పెరిగి, రూ.378 కోట్లుగా నమోదయ్యింది. ఇక ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,478 కోట్ల నుంచి రూ.2,861కి పెరిగింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1,317 కోట్ల నుంచి రూ.1,386కు ఎగసింది. ఆదాయం రూ.9,335 కోట్ల నుంచి రూ.10,799 కోట్లకు చేసింది. నికర వడ్డీ మార్జిన్ 2.40 శాతం నుంచి 2.47 శాతానికి పెరిగింది.
నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.650 కోట్లకు చేరింది. మొత్తం రుణ పంపిణీ 23 శాతం వృద్ధితో రూ.9,938 కోట్లకు ఎగసింది. వ్యక్తిగత రుణ పంపిణీ 24% వృద్ధితో రూ.9,550 కోట్లుగా నమోదయ్యింది. కాగా ఫలితాలు మంచి ఉత్సాహాన్ని ఇచ్చినట్లు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీతా శర్మ పేర్కొన్నారు. ప్రత్యేకించి రుణ పంపిణీలో వృద్ధి, బకాయిల వసూళ్లు సానుకూల పరిణామాలన్నారు. 2015- 16లో కూడా ఇదే విధమైన ప్రోత్సాహకర పరిస్థితి ఉంటుందన్న విశ్వాసాన్ని మేనేజింగ్ డెరైక్టర్ వ్యక్తం చేశారు.