లాకర్లపై బ్యాంకుల కుమ్మక్కు...ఫిర్యాదు కొట్టివేత
న్యూఢిల్లీ: సేఫ్టీ లాకర్ల సేవల విషయంలో రిజర్వ్ బ్యాంక్‌తో పాటు 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు కుమ్మక్కై వ్యవహరిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) కొట్టివేసింది. లాకర్లు అద్దెకు లేదా లీజుకిచ్చినప్పుడు .. కస్టమర్లకు వాటిల్లో దాచుకునే విలువైన వస్తువులు పోయినా లేదా దెబ్బతిన్నా తమ పూచీ ఉండదంటూ బ్యాంకులు అగ్రిమెంట్‌లో షరతు విధించడాన్ని ప్రధానంగా సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన వ్యక్తి.. సీసీఐకి ఫిర్యాదు చేశారు.
అయితే, ఆయా సంస్థలు స్వతంత్ర నిర్ణయాల ఆధారంగా పాటిస్తున్న విధానాలు దాదాపు ఒకే రకంగా ఉన్నంత మాత్రాన.. అవన్నీ కుమ్మక్కయినట్లుగా భావించనక్కర్లేదని, ఆయా విధానాలు పరిశ్రమలో సాధారణంగా పాటించేవిగానే పరిగణించాల్సి ఉంటుందని సీసీఐ పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద ప్రతివాదులు ఇచ్చిన వివరణలు బట్టి చూస్తే.. లాకర్లలోని విలువైన వస్తువులు పోతే.. బ్యాంకులు పూర్తిగా తమ బాధ్యత లేదంటూ దులిపేసుకునే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదని సీసీఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఆర్‌బీఐతో పాటు ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదలైన వాటిపై ఈ ఫిర్యాదు దాఖలైంది.