సెబీ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక ఆదాయాన్ని ఆశచూపి ఇన్వెస్టర్లను మోసగించే పోంజీ స్కీములను అరికట్టేందుకు సెబీకి మరిన్ని అధికారాలనిచ్చే సెక్యూరిటీల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ప్రజలు మోసగాళ్ల బారినపడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే ఓ పథకాన్ని ప్రకటిస్తారని కేంద్రం వెల్లడించింది. సందేహాస్పద సంస్థలకు చెందిన దేశ, విదేశీ కార్యాలయాల్లో సోదాల నిర్వహణకు, వాటినుంచి సమాచారం కోరడానికి కొత్త చట్టం ద్వారా సెబీకి అధికారాలు సమకూరుతాయి. సెబీ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైలోని సంబంధిత న్యాయస్థానం అనుమతించిన తర్వాతే తనిఖీలను నిర్వహించాల్సి ఉంది.
సొమ్మున్న చోటే సొరచేపలుంటాయి... పటిష్టమైన శాసన వ్యవస్థతోనే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. మోసపూరిత పథకాల నుంచి అమాయక ఇన్వెస్టర్లను కాపాడడానికి ఉన్న ఒక మార్గం మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకుల విస్తరణ (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) అని తెలిపారు.
దీనికి సంబంధించి ప్రధాని త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. దేశంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్లు లేని 7.5 కోట్ల కుటుంబాలకు కనీసం రెండేసి చొప్పున ఖాతాలుండాలనేది తమ లక్ష్యమని వివరించారు. అత్యధిక జనాభాకు బ్యాంకులను చేరువచేస్తే పోంజీ స్కీములవైపు ప్రజలు ఆకర్షితులు కావడం దానంతట అదే తగ్గిపోతుందని చెప్పారు.