డెరివేటివ్‌ల లాట్ సైజుల్లో మార్పులు, చేర్పులు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, ఈక్విటీ డెరివేటివ్‌ల కనీస పెట్టుబడి పరిమాణాన్ని భారీగా పెంచింది. లాట్ సైజుల్లో కూడా మార్పులు, చేర్పులు చేసింది. ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉన్న ఈక్విటీ డెరివేటివ్‌ల కనీస పెట్టుబడి పరిమాణాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నామని సెబీ పేర్కొంది. రిస్క్ అధికంగా ఉన్న ఈక్విటీ డెరివేటివ్‌ల నుంచి చిన్న ఇన్వెస్టర్లను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఇది ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి)అమల్లోకి వస్తుందని పేర్కొంది. స్టాక్ డెరివేటివ్స్ లాట్ సైజ్‌ను ఆ స్టాక్ కాంట్రాక్ట్ విలువను బట్టి నిర్ణయిస్తామని వివరించింది. కాంట్రాక్ట్ విలువ రూ.5 లక్షల లోపు ఉంటే స్టాక్ డెరివేటివ్స్‌కు లాట్ సైజ్ 25 గుణి జాల చొప్పున పెరుగుతుందని, ఇందుకు కనీస లాట్‌సైజ్ 50కు తగ్గకుండా ఉండాలని పేర్కొంది. ఒక వేళ 50 లాట్‌సైజ్‌తో కాంట్రాక్ట్ విలువ రూ.10లక్షలకు మించితే లాట్‌సైజ్ 5 గుణిజాలుగా తగ్గుతుందని, కనీస లాట్‌సైజ్ 10కి తగ్గకుండా ఉంటుందని వివరించింది. ఇక ఇండెక్స్ డెరివేటివ్స్ లాట్ సైజ్‌ను కూడా 5 గుణిజాల చొప్పున పెరుగుతుందని, కనీస లాట్ సైజ్ 10కి తగ్గకుండా ఉంటుందని పేర్కొంది.