151 షేర్ల లాట్ సైజుల్లో మార్పులు
- ఈ నెల 28 నుంచి అమల్లోకి
- ఎన్ఎస్ఈ వెల్లడి
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) 151 షేర్లకు సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టుల లాట్సైజుల్లో మార్పులు, చేర్పులు చేసింది. వీటిల్లో పలు బ్లూ చిప్ కంపెనీలు ఉన్నాయి. ఈక్విటీ డెరివేటివ్‌ల కనీస మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని జూలైలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ మార్పులు, చేర్పులు చేసినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఈ మొత్తాన్ని పెంచడం వల్ల నష్టభయం అధికంగా ఉన్న డెరివేటివ్ కాంట్రాక్టుల నుంచి చిన్న ఇన్వెస్టర్లను రక్షించినట్లవుతుందని సెబీ భావిస్తోంది.
నవంబర్‌లో ముగిసే కాంట్రాక్టులకు ఈ లాట్సైజుల మార్పులు, చేర్పులు వర్తిస్తాయని, ఈ లాట్లు ఆగస్టు 28 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్ఎస్ఈ పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్ కాంట్రాక్టులు ప్రస్తుతమున్న లాట్సైజ్లతోనే కొనసాగుతాయని వివరించింది. ముఖ్యాంశాల్లో... నాలుగు షేర్ల మార్కెట్ లాట్ సైజ్‌ను ఎన్ఎస్ఈ తగ్గించింది. బాష్, ఐషర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్.. (ఇవన్నీ ఐదంకెల (రూ.పదివేలకు మించి ఉన్న) షేర్లు) వీటి లాట్ సైజు ప్రస్తుతం 125గా ఉంది. ఆ సైజ్ నుంచి ఐషర్ మోటార్స్, బాష్ లాట్ సైజులను 25కు, ఎంఆర్ఎఫ్ 15కు, పేజ్ ఇండస్ట్రీస్ 50కు తగ్గించింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఇన్ఫ్రా, పీఎస్ఈ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50, డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఎఫ్టీఎస్ఈ 100 తదితర ఎనిమిది సూచీల లాట్ సైజులను పెంచింది.