
ప్రపంచ రుణ భారంపై జాగ్రత్త
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారం పట్ల జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ఈ రుణ భారం ఆల్-టైమ్ హైకి చేరినట్లు పేర్కొంది. గడచిన ఏడాదికి ఫైనాన్షియల్ సెక్టార్‌ను మినహాయించి చూస్తే... ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారాలు 152 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక తెలిపింది. ఇందులో 65 శాతానికిపైగా ప్రైవేటు రంగానిదని వివరించింది. ఇదే తీరు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధి మళ్లీ వెనక్కు తిరుగుతుందని ఐఎంఎఫ్ వివరించింది.
ఈజీ మనీ విధానం సమస్యకు మూలం
ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల ‘ఈజీ మనీ’ విధానమే అసలు సమస్యని కూడా పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం మొదలుకొని వృద్ధికి మద్దతుగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. చైనాలో పెరుగుతున్న ప్రైవేటు రంగం రుణ భారం, కొన్ని దిగువ ఆదాయ దేశాల్లో ప్రభుత్వ రుణాల భారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థల మందగమనం వల్ల రుణ భారాలు తగ్గించుకోవడం అటు కంపెనీలకు ఇటు దేశాలకు కూడా కష్టమైన పనని పేర్కొంది.
రుణ భారం తగ్గించుకునే ప్రక్రియలో తీసుకునే నిర్ణయాలు వ్యయాలకు, పెట్టుబడులకు విఘాతంగా మారి చివరికి అది ప్రపంచ వృద్ధి గతిపై ప్రభావం చూపుతుందనీ విశ్లేషించింది. ఇదే పరిస్థితి కొనసాగితే, తాజా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని, ఇది తీవ్ర ఆర్థిక మాంద్యం పరిస్థితికి దారితీసే వీలుందని ఐఎంఎఫ్ ద్రవ్య నిర్వహణా విభాగ నివేదిక హెచ్చరించింది.
పరిస్థితి మెరుగుపడాలంటే...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితులను కూడా నివేదిక వివరించింది. ఇందులో ఒకటి బలమైన వృద్ధి తీరు ఒకటికాగా, ఇందుకు ప్రధానంగా సాధారణ స్థాయి ద్రవ్యోల్బణ పరిస్థితులని పేర్కొంది. ఉత్పాదకతను, ఉపాధిని సృష్టించే పెట్టుబడులు, ద్రవ్య, వాణిజ్య పరమైన పెట్టుబడులు, కంపెనీలు క్రమంగా తమ రుణ భారాలను తగ్గించుకోవడం వంటివి ఇందులో కీలకమని వివరించింది.