సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ప్రతీ నెల పెరిగే వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ నెలలో కేవలం 9 రోజుల్లోనే రెండవసారి పెరిగింది. ఎల్‌పీజీ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధరను సిలిండర్‌కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన సరఫరాదారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్ ధర రూ. 507.42కు చేరింది.
డీలర్ల కమిషన్
ప్రస్తుతం వంటగ్యాస్ డీలర్లకు 14.2కేజీల సిలిండర్‌కు రూ.48.89, 5కేజీల సిలిండర్‌కు రూ. 24.20 చొప్పున కమిషన్ ఇస్తున్నారు. అయితే దీన్ని పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14.2కేజీల సిలిండర్‌కు రూ. 50.58, 5 కేజీల సిలిండర్‌కు రూ. 25.29 చొప్పున కమిషన్ ఇవ్వాలి. 14.2 కిలోల సిలిండర్‌కు 20.50 డెలివరీ ఛార్జ్ ఉంటుంది. అయితే పంపిణీదారుల ప్రాంగణంనుంచి సిలిండర్‌ను నేరుగా తీసుకుంటే డెలివరీ ఛార్జినుంచి మినహాయింపు వుంటుందని ఇంధన సరఫరాదారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఈ నెలలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది రెండో సారి. నవంబరు 1వ తేదీనే రాయితీ గ్యాస్ సిలిండర్‌పై రూ. 2.94 పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతినెలా వంటగ్యాస్ ధర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆరు నెలల్లో రూ. 16.21 మేర ధర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment