న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం లుపిన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 65 శాతం తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత క్యూ3లో రూ.633 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.222 కోట్లకు తగ్గినట్లు లుపిన్ తెలిపింది. ఆదాయం రూ.4,405 కోట్ల నుంచి 11 శాతం క్షీణించి రూ.3,900 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బీఎస్‌ఈ ఇంట్రాడేలో లుపిన్ షేర్ ఏడాది కనిష్ట స్థాయి, రూ.790కి పడిపోయింది. చివరకు 6 శాతం నష్టంతో రూ.802 వద్ద ముగిసింది.
కెల్టన్ టెక్ లాభంలో 23 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎంటర్‌ప్రైజ్ సొల్యుషన్స్ కంపెనీ కెల్టన్ టెక్ డిసెంబరు త్రైమాసికంలో నికరలాభం క్రితం ఏడాదితో పోలిస్తే 23.6 శాతం పెరిగి రూ.17 కోట్లుగా నమోదయింది. టర్నోవరు 33 శాతం అధికమై రూ.210 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో షేరు ధర 5 శాతం వరకూ పెరిగి రూ.114 వద్ద క్లోజయింది.
27 శాతం తగ్గిన హెరిటేజ్ లాభం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభం క్రితంతో పోలిస్తే 27.4 శాతం తగ్గి రూ.16.7 కోట్లకు పడిపోయింది. టర్నోవరు రూ.466 కోట్ల నుంచి రూ.583 కోట్లకు ఎగసింది. ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.2,162 కోట్ల టర్నోవరుపై రూ.43 కోట్ల నికరలాభం నమోదైంది. సోమవారం నాటి ధరతో పోలిస్తే ఇంట్రాడేలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర మంగళవారం ఏకంగా 8 శాతం వరకూ క్షీణించి రూ.670కి పడిపోయింది. చివరకు 3.8 శాతం నష్టంతో 698 దగ్గర క్లోజయింది. కాకపోతే ఈ ఫలితాలు మంగళవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి.
గల్ఫ్ ఆయిల్ రూ.4 మధ్యంతర డివిడెండ్..
గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 59 శాతం అధికమై రూ.42.5 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.312 కోట్ల నుంచి రూ.363 కోట్లను తాకింది. ఈ షేరు ఇంట్రా డేలో 5 శాతం వరకూ నష్టపోయినా... ఫలితాలు బాగుండటంతో రికవరీ అయింది. చివరకు రూపాయి నష్టంతో రూ.895 వద్ద క్లోజయింది.
Comments
Please login to add a commentAdd a comment