ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్! | M-commerce app builder, mobile commerce shopping cart ... | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్!

Published Sat, Feb 28 2015 2:15 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్! - Sakshi

ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్!

- ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్ కూడా
- అది కూడా రూ.1,000-3,000లకే
- హైదరాబాదీ స్టార్టప్ మార్ట్‌మోబీ సేవలు
- రూ.12 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ‘‘దేశంలోని ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటైన మింత్ర.కామ్ ఈ ఏడాది చివరికల్లా తన ఈ-కామర్స్ సైట్‌ను మూసేసే అవకాశముంది. ఎందుకంటే ఇకపై తన వ్యాపారాన్ని పూర్తిగా మొబైల్ యాప్ ద్వారానే విస్తరించాలని సంస్థ భావిస్తోంది.’’
 
‘‘ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లైతే తమ ఈ-కామర్స్ వ్యాపారంలో 60-70 శాతం కొనుగోళ్లు కేవలం సెల్‌ఫోన్ల ద్వారా జరుగుతున్నవే అని ప్రకటించాయి.’’
 ... ఇవి చాలు ఈ-కామర్స్ స్థానాన్ని మొబైల్ కామర్స్ ఎలా ఆక్రమిస్తోందో చెప్పడానికి. ఇదంతా నిజమే కానీ మొబైల్ కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లను క్రియేట్ చేసుకోవటం అంత ఈజీ కాదు. సమయమూ కాస్త ఎక్కువే పడుతుంది. అయితే ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్‌ను, యాప్‌ను క్రియేట్ చేస్తోంది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ మార్ట్‌మోబీ.

ప్రస్తుతం ఈ సంస్థ అందించిన ఎం-కామర్స్ సైట్లు, యాప్‌లు దేశంతో పాటు, అంతర్జాతీయంగా 20 దేశాల్లో తమ సేవల్ని అందిస్తున్నాయి. ‘‘ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోన్లే. ఈ-కామర్స్ కంటే ఎం-కామర్స్ షాపింగ్ బాగా పెరుగుతోంది. యువత అభిరుచులతో పాటు వారి ఆలోచనల్ని కూడా ఫాలో అయ్యే ఈ-కామర్స్ కంపెనీలు ఎం-కామర్స్ వేదికలుగా యువత ముందుకొస్తున్నాయి. ఇదంతా గమనించినపుడు మాకో విషయం తెలిసింది. ఎం-కామర్స్ సైట్స్, యాప్‌లను క్రియేట్ చేయాలంటే ఎంతలేదన్నా రూ.5-10 లక్షలు ఖర్చు, 3-6 నెలల సమయమూ పడుతోందని. ఇందుకు పరిష్కారం చూపించాలనే ప్రమోద్ నాయర్‌తో కలిసి నేను వ్యవస్థాపక సీఈఓగా 2013 జనవరిలో మార్ట్‌మోబీ సంస్థను ప్రారంభించాం’’ అన్నారు సత్యక్రిష్ట గన్ని.
 
ఒక్క రోజులోనే..: ‘‘మార్ట్‌మోబీతో ఒక్క రోజులోనే ఎం-కామర్స్ సైట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. రెండో రోజు నుంచే వ్యాపారం కూడా చేసుకోవచ్చు. ధర విషయానికొస్తే.. ఉత్పత్తులను బట్టి మారుతుంది. రూ.1,000కి వెయ్యి ఉత్పత్తులను విక్రయించే సామర్థ్యం, మొబైల్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యాప్‌ను క్రియేట్ చేసి ఇస్తాం. అదే రూ.3,000లకైతే పైవాటితో పాటుగా ఐఫోన్ యాప్ కూడా అదనంగా క్రియేట్ చేసిస్తాం’’ అన్నారాయన.
 
20 దేశాల్లో సేవలు..: ప్రస్తుతం మార్ట్‌మోబీ అందించిన ఎం-కామర్స్ సైట్లు, యాప్‌లు యూఎస్, యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, సింగపూర్ వంటి సుమారు 20 దేశాల్లో సేవలందిస్తున్నాయి. దేశీయంగా నీరూస్, కారట్‌లైన్, అమెరికన్ స్వాన్, జివామీ, ప్రెట్టీ సీక్రెట్స్ వంటి సుమారు 150-160 కంపెనీలు మార్ట్‌మోబీ క్రియేట్ చేసిన ఎం-కామర్స్ సైట్లను, ఆప్‌ల ద్వారా వ్యాపారం చేస్తున్నాయి.
 
రూ.12 కోట్ల పెట్టుబడులు..
‘‘ఇప్పటివరకు మార్ట్‌మోబీలో కోటిన్నర వరకు పెట్టుబడులు పెట్టాం. ఇటీవలే సేతు సాఫ్ట్‌వేర్, బిట్చెమీ వెంచర్స్ రూ.కోటి పెట్టుబడుల్ని పెట్టాయి. ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థతో రూ.12 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాం. మరో నెల రోజుల్లో సంస్థ పేరు, వివరాలను వెల్లడిస్తాం. ప్రస్తుతం కంపెనీలో 20 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే 70-80కి పెంచుతాం. ఎం-కామర్స్‌లో మార్ట్‌మోబీ ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం’’ అని సత్యకృష్ణ వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే  startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement