ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో అమెజాన్ షేర్ హోల్డర్, రచయిత్రి మెకాంజీ చోటు దక్కించుకున్నారు. 36.8 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఫ్రాన్స్ బిలియనీర్ ఫ్రాంకోయిస్ బెట్టెన్‌కోర్ట్ మేయర్స్ 53.7 బిలియన్ డాలర్ల ఆర్జనతో మొదటి స్థానం దక్కించుకోగా... వాల్‌మార్ట్ స్థాపకుడు సామ్ వాల్టన్ కూతురు అలిస్ వాల్టన్ రెండో స్థానాన్ని(50.4 బిలియన్ డాలర్లు) ఆక్రమించారు. కాగా మెకాంజీ... అమెజాన్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య అన్న విషయం తెలిసిందే. పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు తీసుకున్నామంటూ బెజోస్, మెకాంజీ ఈ ఏడాది ప్రారంభంలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్ అమెజాన్ షేర్లను జెఫ్ బెజోస్ మెకాంజీ పేరిట బదలాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఫోర్బ్స్ సంపన్న మహిళగా నిలవడంతో.. పాటు విశ్వంలో ఉన్న సంపన్నుల జాబితాలో 23వ స్థానం దక్కించుకున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక రచయిత్రి అయిన మెకాంజీ (48) న్యూయార్క్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో తొలిసారిగా బెజోస్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరునెలల తరువాత అదే ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు.
కాగా మెకాంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే తన రచనలకు, మొదటి బెస్ట్ రీడర్ అని ఆమె చెప్పేవారు. రచనా వ్యాసంగంతోపాటు మెకాంజీ బైస్టాండర్ రివల్యూషన్ (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. 1994లో ఆన్‌లైన్ బుక్సెల్లర్‌గా ఏర్పాటైన అమెజాన్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకాంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు. ఇటీవలే అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment